అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఆసిఫాబాద్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, టీజీపీఎస్‌సీ చైర్మన్ బుర్ర వెంకటేశ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో ఇందిరమ్మ ఇళ్లు, గ్రూపు– 2 పరీక్షలు, డైట్ చార్జీల పెంపు, సమ గ్ర సర్వేపై సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో దరఖాస్తుదారుల వివరాలు స్పష్టంగా నమోదు చేయాలన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఇళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 లక్షల దరఖాస్తులు రాగా, అర్హుల గుర్తింపు కోసం సర్వే నిర్వహిస్తున్నామని వివరించారు. సర్వేయర్లు ప్రతిరోజూ కనీసం 25 ఇళ్లు సర్వే చేయాలని ఆదేశించారు. అనంతరం టీజీపీఎస్‌సీ చైర్మన్ మాట్లాడుతూ ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్–2 పరీక్షలకు జిల్లాలో కేంద్రాలు ఏర్పాటు చేసి సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 1,51,712 ప్రజాపాలన దరఖాస్తులు రాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశీలిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment