సన్నద్ధం
స్థానిక పోరుకు
● మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ● ఈ నెల 17న తుది ఓటరు జాబితా ● ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు గుర్తింపు ● జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు
ఆసిఫాబాద్ మండలం
బూర్గుడ గ్రామ పంచాయతీ కార్యాలయం
ఆసిఫాబాద్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మరో నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో జిల్లా అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ముందస్తు కసరత్తు ప్రారంభించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే జిల్లా అధికారులతో కలిసి ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. స్థానిక ఎన్నికల నిర్వహణ, అధికారులు, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. మండలాలు, గ్రామాల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేయడంతోపాటు అవసరం మేరకు పోలింగ్ కేంద్రాలు సైతం గుర్తిచారు. పోలింగ్ అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లు సమకూరుస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఏఎంసీ గోదాములో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్‌లను పరిశీలించారు.
335 జీపీల్లో 2,784 వార్డులు
జిల్లాలో మొత్తం 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా జీపీల్లో 2,784 వార్డులను అధికారులు గుర్తించారు. మొత్తం 3,51,194 మంది ఓటర్లు ఉండగా 1,75,571 పురుషులు, 1,75,605 మహిళలు, 18 మంది ఇతరులు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం 2,874 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, ఇందులో 34 తాత్కాలిక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమున్న సిబ్బందిని సమకూర్చుకునేందుకు వివరాలు సేకరిస్తున్నారు. ఆయా వివరాలను ఎన్నికల వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. 15 మండలాల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా దీనిపై జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.
షెడ్యూల్ ఇలా..
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 6న ముసాయిదా ఓటరు జాబితాను ప్రదర్శించి పోలింగ్ స్టేషన్ల వివరాలను అప్రూవల్ కోసం కలెక్టర్‌కు సమర్పించారు. 7న పోలింగ్ స్టేషన్ల ముందు ఓటరు జాబితా ప్రదర్శించి, 10న రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నెల 7 నుంచి 12 వరకు అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యింది. 13న అభ్యంతరాలు పరిష్కరించి 16న తుది ఓటరు జాబితాను అప్రూవల్ కోసం పంపించనున్నారు. ఆ తర్వాత 17న తుది ఓటరు జాబితా ప్రదర్శన ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమయాత్తమవుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాల పేరుతో ప్రజల్లోకి వెళ్తుంటే ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాయి. ఇప్పటికే జిల్లా కేంద్రంలో బైక్‌ర్యాలీతో పాటు సమావేశాలు నిర్వహించారు. అధికార పార్టీ అమలుకాని హామీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు ఉత్సాహంగా ఉన్న అభ్యర్థులు కూడా క్షేత్రస్థాయిలో తమ ప్రయత్నాలు ప్రారంభించారు. కులగణన సర్వే పూర్తయినప్పటికీ బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రాలేదు. బీసీ రిజర్వేషన్లు అమలైతే సమీకరణాలు మారే అవకాశం ఉంది.
జిల్లాలో గ్రామ పంచాయతీల వివరాలు
మండలం పంచాయతీలు వార్డులు
ఆసిఫాబాద్ 27 236
బెజ్జూర్ 22 188
చింతలమానెపల్లి 19 176
దహెగాం 24 200
జైనూర్ 26 222
కాగజ్‌నగర్ 28 266
కెరమెరి 31 250
కౌటాల 20 182
లింగాపూర్ 14 112
పెంచికల్‌పేట్ 12 102
రెబ్బెన 24 214
సిర్పూర్(టి) 16 144
సిర్పూర్(యూ) 15 124
తిర్యాణి 29 222
వాంకిడి 28 236
ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం
జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు గుర్తించాలి. ఓటరు జాబితా సైతం సిద్ధం చేస్తున్నాం. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– భిక్షపతిగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి
Comments
Please login to add a commentAdd a comment