అర్ధాకలి చదువులు!
ఈ ఫొటోలోని విద్యార్థి పేరు సుజాత. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సమీపంలో అంకుసాపూర్ నుంచి పాఠశాలకు వస్తుంది. ఒక్కోసారి ఇంటివద్ద ఉదయం భోజనం చేసేందుకు సమయం ఉండటం లేదు. ప్రస్తుతం స్కూల్‌లో అల్పాహారం అందించకపోవడంతో ఆకలికి ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం స్నాక్స్ ఏర్పాటు చేయాలని కోరుతోంది.. ఇలా జిల్లాలో పలువురు పదో తరగతి విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు.
ఆసిఫాబాద్‌రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. విద్యార్థులకు సాయంత్రం గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పిల్లలు ఉదయం 9 గంటలకే పాఠశాలకు వస్తున్నారు. స్కూళ్లలో గతంలో ఉదయం 10 గంటలకు అల్పాహారం అందించేవారు. ఈ విద్యా సంవత్సరం అల్పాహారం నిలిచిపోయింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బడిలో ఉంటూ ఆకలితో ఇబ్బంది పడుతున్నారు.
6,850 మంది విద్యార్థులు
జిల్లావ్యాప్తంగా మొత్తం 272 ఉన్నత పాఠశాలు ఉన్నాయి. ఇందులో డీఈవో పరిధిలో 77, ప్రైవేట్ 34, గిరిజన ఆశ్రమ, బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ గురుకులాలు 171 ఉండగా, 6,850 మంది పదో తరగతి విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉత్తమ ఫలితాల సాధన కోసం విద్యాశాఖ సాయంత్రం 4:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. ఉన్నత పాఠశాలలు గ్రామాలకు దూరంగా ఉండటంతో చాలామంది ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరుతున్నారు. ఇళ్లలో వంట కాకపోవడంతో పరిగడుపునే పాఠశాలకు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పదో తరగతి విద్యార్థులు సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉంటున్నారు. గతంలో విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించగా, దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేది. జిల్లాలో చలి తీవ్రత కూడా పెరుగుతుండడంతోపాటు ఉదయం పూట ఆకలితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దాతలు ముందుకొస్తేనే..
ప్రస్తుతం జిల్లాలో చలిప్రభావం తీవ్రస్థాయిలో ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. ఈ తరుణంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చాలావరకు పేద, మధ్య తరగతి వర్గాల వారే ఉన్నారు. ఏజెన్సీ గ్రామాలు, మారుమూల ప్రాంతాల నుంచి ఉదయం ఏమీ తినకుండానే పాఠశాలకు వస్తున్నారు. మధ్యాహ్న భోజనంపైనే వీరు ఆధారపడుతున్నారు. ఒక్కపూట తిని సాయంత్రం 5 గంటల వరకు ఉండాల్సి రావడంతో ఆకలికి అలమటిస్తున్నారు. గతంలో విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్, బిస్కెట్ అందించేవారు. కొన్నిచోట్ల ఉపాధ్యాయులే వీటిని ఏర్పాటు చేసేవారు. స్నాక్స్, అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులు
‘పది’ విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక స్టడీ అవర్స్
5 గంటల వరకు బడిలోనే..
అల్పాహారం, స్నాక్స్ అందించకపోవడంతో ఇబ్బందులు
ప్రభుత్వం, దాతలు స్పందిస్తేనే మేలు
చలితోనూ తప్పని అవస్థలు
ప్రత్యేక తరగతులు ఇలా..
జిల్లాలో రెగ్యులర్ జిల్లా విద్యాశాఖ అధికారి లేరు. మొన్నటి వరకు ఉపాధ్యాయుల కొరతతో సిలబస్ కూడా పూర్తికాలేదు. ప్రస్తుతం సాయంత్రం 4:15 నుంచి 5 గంటల వరకు ప్రతిరోజూ ఒక సబ్జెక్టు టీచర్ సాయంత్రం గంట ప్రత్యేక స్టడీ అవర్ నిర్వహిస్తున్నారు. గ్రూపులుగా విభజించి చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేస్తున్నారు. డిసెంబర్ 31 నాటికి వందశాతం సిలబస్ పూర్తిచేయాలని విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అలాగే రివిజన్‌పైనా దృష్టి సారించాల్సి ఉంది. మరోవైపు కేజీబీవీల్లో ప్రత్యేక తరగతులపై ఉద్యోగుల సమ్మె ప్రభావం పడుతోంది. ఇతర ఉపాధ్యాయులు వస్తే తాము కూడా పనిచేయమని శుక్రవారం నుంచి నాన్‌టీచింగ్ సిబ్బంది సైతం సమ్మెకు మద్దతు తెలిపారు. గతేడాది పదో తరగతి వార్షిక ఫలితాల్లో పలు కేజీబీవీలు వందశాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. ఈ విద్యా సంవత్సరంలో సుమారు 600 మంది పదో విద్యార్థులు ఉన్నారు.
సందేహాల నివృత్తి
ప్రత్యేక తరగతుల ద్వారా పాఠ్యాంశాల్లోని సందేహాలు ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు. పదో తరగతిలో మెరుగైన మార్కులు సాధిస్తాననే నమ్మకం ఉంది. ప్రభుత్వం స్పందించి పదో తరగతి విద్యార్థుల ఆకలి తీర్చాలి.
– అంజలి,
పదో తరగతి, ఆసిఫాబాద్ మోడల్ స్కూల్
వెంటే ఉండి చదివిస్తున్నారు
ఉపాధ్యాయులు ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ మా వెంటే ఉండి చదివిస్తున్నారు. తరగతిలో అందరం ఉత్తీర్ణత సాధిస్తాం. వార్షిక పరీక్షల్లోనూ మెరుగైన గ్రేడ్ వస్తుందనే నమ్మకం ఉంది.
– అక్షిత,
పదో తరగతి, ఆసిఫాబాద్ మోడల్ స్కూల్
స్నాక్స్ అందించాలి
ప్రతిరోజూ సాయంత్రం ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించి పదో తరగతి విద్యార్థులకు బిస్కెట్, స్నాక్స్ అందించాలి. ఆకలి తీర్చేందుకు ఏర్పాట్లు చేయాలి.
– శ్రీమాన్,
పదో తరగతి, ఆసిఫాబాద్ మోడల్ స్కూల్
Comments
Please login to add a commentAdd a comment