ట్రబుల్‌ ఐటీ కాదు.. ట్రిపుల్‌ ఐటీ | - | Sakshi
Sakshi News home page

ట్రబుల్‌ ఐటీ కాదు.. ట్రిపుల్‌ ఐటీ

Published Sat, Dec 14 2024 1:35 AM | Last Updated on Sat, Dec 14 2024 1:35 AM

ట్రబు

ట్రబుల్‌ ఐటీ కాదు.. ట్రిపుల్‌ ఐటీ

● సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ● ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ● కలెక్టర్‌తో కలిసి కళాశాల సందర్శన ● తక్షణావసరాలకు రూ.కోటి మంజూరు

భైంసా: బాసర ఆర్జీయూకేటీ ట్రబుల్‌ఐటీ కాదు.. ట్రిపుల్‌ఐటీ అని నిరూపిస్తామని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. శుక్రవారం కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ఎస్పీ జానకీషర్మిల, ముధోల్‌ ఎమ్మెల్యే రామారావుపటేల్‌, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావుపటేల్‌, విఠల్‌రెడ్డితో కలిసి కళాశాలను సందర్శించారు. విద్యార్థులు మంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతించారు. అనంతరం వీసీ గోవర్ధన్‌తో కలిసి విద్యార్థులతో గంటకు పైగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మంత్రికి సమస్యలు తెలిపారు. 70శాతం బాలికలున్న క్యాంపస్‌లో ఒక్క గైనకాలజిస్ట్‌ కూడా లేరని, వారానికి రెండుసార్లు డాక్టర్లు వచ్చిపోతారని, ల్యాప్‌టాప్‌లు పాత బడ్డాయని, యూనిఫాంలు అందలేదని, మెస్‌లలో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, రెగ్యులర్‌ ఫ్యాకల్టీ లేక చదువులో వెనుకబడుతున్నామని, డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదని వివరించారు. బడ్జెట్‌ పెంచి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్జీయూకేటీని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. దీంతో విద్యార్థులు ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. గతేడాది కలెక్టర్‌, ఎస్పీతో ట్రిపుల్‌ఐటీలోని పరిస్థితులు, విద్యార్థుల సమస్యలపై నివేదికలు తెప్పించుకున్నామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తక్షణ అవసరాల కోసం రూ.కోటి ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, మెస్‌లను నిరంతరం పర్యవేక్షించి నాణ్యమైన భోజనం అందేలా చూడాలని వీసీకి సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆర్జీయూకేటీలోని సమస్యలు పరిష్కరించాలని ముధోల్‌ ఎమ్మెల్యే రామారావుపటేల్‌ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వలో ట్రిపుల్‌ఐటీలో జరిగిన అవినీతి, అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రూ.50కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేసి సమస్యలు పరిష్కరించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

బాసర ఆలయాభివృద్ధిపై దృష్టి

బాసర శ్రీజ్ఞానసరస్వతీ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క పేర్కొన్నారు. శుక్రవారం బాసరలో నిర్వహించిన కాంగ్రెస్‌ సమావేశానికి హాజరై మాట్లాడారు. నెలక్రితమే దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆలయానికి రూ.50 కోట్లు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. మరోసారి సమావేశమై ఆలయ అభివృద్ధిపై చర్చిస్తామని చెప్పారు. మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసి సరస్వతీ అమ్మవారి గొప్పతనాన్ని దేశానికి చాటిచెప్పేలా ఆలయాన్ని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.వేల కోట్ల అభివృద్ధి చేసినా జిల్లా ప్రజలు బీజేపీ అక్షింతలకే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు వేశారని పేర్కొన్నారు. 11ఏళ్ల క్రితమే జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షలు జమచేస్తామన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ మాట నిలబెట్టుకోలేదని ఆరోపించారు. అగర్‌బత్తీలపై జీఎస్టీ వేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పన్నుల రూపంలో కేంద్రానికి రూ.వేల కోట్లు చెల్లిస్తున్నా ఆ స్థాయిలో రాష్ట్రానికి నిధులు రావడంలేదని విమర్శించారు. జిల్లాలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నా కనీసం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు ఒక్క నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేయించలేకపోయారని ఆరోపించారు. ఎన్నడూ లేనట్లు సన్నరకాలు పండించిన రైతులకు బోనస్‌ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత కరెంట్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వంటగ్యాస్‌పై రూ.500 సబ్సిడీ కల్పిస్తున్నట్లు చెప్పారు. అర్హులందరి పంటరుణాలు మాఫీ చేస్తామని, రైతు భరోసా తప్పకుండా వేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు.

పార్టీని బలోపేతం చేయాలి

జిల్లాలో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని మంత్రి సీతక్క పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయోత్సవాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించాలని సూచించారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, నారాయణరావుపటేల్‌, భైంసా ఏఎంసీ చైర్మన్‌ ఆనంద్‌రావుపటేల్‌, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ట్రబుల్‌ ఐటీ కాదు.. ట్రిపుల్‌ ఐటీ1
1/1

ట్రబుల్‌ ఐటీ కాదు.. ట్రిపుల్‌ ఐటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement