బోధనకు ఆటంకం
● కొనసాగుతున్న సమగ్ర ఉద్యోగుల సమ్మె ● జిల్లాలోని 15 కేజీబీవీల్లో విద్యాబోధనపై ప్రభావం ● పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్థుల ఆందోళన
ఆసిఫాబాద్‌అర్బన్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. దీని ప్రభావం కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో బోధనకు ఆటంకం ఏర్పడుతోంది. వార్షిక పరీక్షలకు సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విద్యాశాఖ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లా వ్యాప్తంగా 15 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. ఆసిఫాబాద్‌లో ఒక అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల ఉంది. ఇందులో 3,942 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆయా పాఠశాలల్లో మొత్తం 315 మంది సమగ్ర శిక్షా పరిధిలోని బోధన, బోధనేతర సిబ్బంది కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. ఇందులో స్పెషల్ ఆఫీసర్లు, పీజీ సీఆర్టీలు, సీఆర్టీలు, పీఈటీలు, అకౌంటెంట్లు, క్రాఫ్ట్ టీచర్లు, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లు, వంట మనుషులు, వాచ్‌మెన్‌లు, స్వీపర్లు, స్కావెంజర్లు ఉన్నారు. ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడంతోపాటు కనీస వేతనాలు అమలు చేయాలని సమ్మెబాట పట్టారు. నాలుగు రోజులుగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్నారు. బోధనేతర సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనడటంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
విద్యార్థులకు ఇబ్బందులు
ప్రతీ కేజీబీవీలో విద్యార్థుల రక్షణ కోసం ఇద్దరు, ముగ్గురు నాన్‌టీచింగ్ సిబ్బంది మినహా మిగిలిన వారంతా మూకుమ్మడిగా కలెక్టరేట్ ఎదుట సమ్మెలో పాల్గొంటున్నారు. కేజీబీవీలో దాదాపు బోధన స్తంభించిపోయింది. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. ఈ నెల చివరి నాటికి సిలబస్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. అలాగే ఇంటర్మీడియెట్ విద్యార్థులకు కూడా ఫిబ్రవరిలో ప్రయోగ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, మార్చిలో వార్షిక పరీక్షలు ఉంటాయి. బోధనకు ఆటంకం ఏర్పడటంతో వారు ఆందోళన చెందుతున్నారు. బోధించేవారు లేక ప్రతిరోజూ తరగతులకు హాజరవుతూ సొంతంగా చదువుకుంటున్నారు.
సర్దుబాటు చేస్తాం
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ బోధనకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి బోధనకు ఆటంకం లేకుండా చూస్తాం. – యాదయ్య, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment