గ్రూపు– 2 పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో గ్రూపు– 2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, గిరిజన బాలుర గురుకుల పాఠశాలలోని కేంద్రాలను శుక్రవారం ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే పరీక్ష కోసం ఆసిఫాబాద్‌లో 9, కాగజ్‌నగర్‌లో 9 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు ఇతర సదుపాయాలు కల్పించాలన్నారు. అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, షూలు వేసుకునేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆయన వెంట పరీక్షల ప్రాంతీయ సమన్వయకర్త లక్ష్మీనరసింహ తదితరులు ఉన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
గ్రూపు– 2 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ శ్రీని వాసరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ విధించామన్నారు. 500 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, డీఎస్పీలు కరుణాకర్, రామానుజం, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment