వైద్య విద్యార్థులకు క్రమశిక్షణ, అంకితభావం అవసరం
ఏడీఎంఈ డాక్టర్ వెంకటేష్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి వైద్య విద్యార్థికి క్రమశిక్షణ, అంకితభావం ఎంతో అవసరమని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(ఏడీఎంఈ) డాక్టర్ డి. వెంకటేష్ అన్నారు. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా చేరిన వైద్య విద్యార్థులకు శుక్రవారం వైట్‌కోట్, ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ డి. వెంకటేష్ కొత్తగా చేరిన వైద్య విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో వైద్యులకు ఒక ఉన్నతమైన గౌరవం ఉందని, దానిని కాపాడుకునేందుకు చిత్తశుద్ధి, సేవాభావం అవసరమని ఆయన సూచించారు. ఈ కళాశాలలో ర్యాగింగ్ లాంటి విష సంస్కృతి లేకుండా నివారించామన్నారు. జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా అందరూ స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. అశోక్‌కుమార్ మాట్లాడుతూ వైద్య విద్యలో సీటు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ పట్టుదలతో చదివాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ. వెంకటేశ్వరరావు, రేడియాలజి విభాగాధిపతి డాక్టర్ పర్వతేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
శిశువు సహా తల్లి
అనుమానాస్పద మృతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అప్పుడే పుట్టిన బిడ్డతో సహా తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన విజయవాడ భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలోని విద్యాధరపురం రావిచెట్టు సెంటర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పొదిలి సమ్మక్క దుర్గాఘాట్‌లో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఆమెకు భర్త ఒక బాబు ఉన్నారు. కొంత కాలం క్రితం భర్తను వదిలివేసింది. బాబును గుంటూరు హాస్టల్‌లో చదివిస్తోంది. ఈ క్రమంలో దుర్గాఘాట్‌లోనే స్వీపర్‌గా పనిచేస్తున్న నాగరాజు పరిచయం అయ్యాడు. ఇద్దరు ఇష్టపడి 2021 పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సమ్మక్క 8 నెలల గర్భిణీ. ఈనెల 19న నాగరాజు దుర్గాఘాట్‌లో పనికి బయలుదేరాడు. ఆ సమయంలో సమ్మక్క తాను గుంటూరు వెళ్లి హాస్టల్‌లో ఉంటున్న బాబును చూసి వస్తానని చెప్పింది. సరే అంటూ నాగరాజు పనికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతను ఘాట్ వద్దే ఉంటూ పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి చుట్టు పక్కల వారు వచ్చి మీ ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని చెప్పారు. నాగరాజు వెళ్లి వంట గది కిటీకిలోంచి చూశాడు. సమ్మక్క మగ శిశువుకు జన్మనిచ్చి రక్తమడుగులో చనిపోయి ఉంది. తలుపులు తీసి చూడగా పుట్టిన మగబిడ్డ కూడా చనిపోయి ఉన్నాడు. దీనిపై నాగరాజు ఇచ్చిన ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment