విజయవంతంగా ‘దీపం–2’
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో దీపం–2 పథకం ద్వారా లబ్ధిపొందిన వారి సంఖ్య మూడు వారాల్లోనే 50 లక్షల మైలురాయిని చేరుకోవడం గర్వకారణమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం విజయవాడ కృష్ణలంకలోని కోతమిషన్ రోడ్డులో జరిగిన దీపం–2 ప్రత్యేక కార్యక్రమంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి పాల్గొని లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలెండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి 55 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, దీపావళి రోజున ప్రతి మహిళ కళ్లల్లో సంతోషం నింపే విధంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లను ఉచితంగా అందించే దీపం–2 పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారన్నారు. గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే చాలని, దీపం–2 పథకం ద్వారా లబ్ధిపొందవచ్చన్నారు. 48 గంటల్లోనే లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో నిధులు జమ అవుతున్నాయని వివరించారు. పౌర సరఫరాల కార్పొరేషన్ వీసీ, ఎండీ జి.వీరపాండ్యన్, జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, విజయవాడ ఆర్‌డీవో కె.చైతన్య, డీఎస్‌వో ఎ.పాపారావు, తహసీల్దార్ ఎం.వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment