ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
మూడు బైక్‌లు స్వాధీనం
విజయవాడస్పోర్ట్స్: గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఘరానా దొంగను సీసీఎస్, పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం, మాదల గ్రామానికి చెందిన నిందితుడు తమ్మిశెట్టి వెంకటేష్ నుంచి మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వన్‌టౌన్‌లోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ వద్ద సెంట్రల్ ఏసీపీ దామోదర్, సీసీఎస్ సీఐ రామ్‌కుమార్, పటమట సీఐ పవన్‌కిశోర్ శుక్రవారం వెల్లడించారు. సీసీఎస్ పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారంతో ఆటోనగర్ చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం వాహనాల తనిఖీలు నిర్వహించామని, తనిఖీలు జరుగుతున్న సమయంలో నిందితుడు అటుగా వస్తూ.. ఒక్కసారిగా బైక్ వెనక్కి తిప్పుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడని వారు తెలిపారు. దీంతో అనుమానం వచ్చి అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో నిందితుడు బైక్‌లను చోరీ చేస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. 24 ఏళ్ల వయసున్న నిందితుడు వెంకటేష్ గంజాయి, మద్యపానానికి అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుడిపై గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఐదు చోరీ కేసులున్నాయని, నిందితుడి నుంచి మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment