అగమ్యగోచరంలో అంగన్‌వాడీలు
గుడివాడరూరల్: నిత్యావసరాల ధరలు భారీగా పెరిగినా మెనూ ప్రకారం చిన్నారులకు మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అంగన్‌వాడీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అప్పులు చేసి చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సిన పరిస్థితి నెలకొంది. గుడివాడ నియోజకవర్గంలోని గుడివాడ పట్టణం, మూడు మండలాల్లో కలిపి 251 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందజేయాల్సి ఉంటుంది. అంగన్‌వాడీలకు ప్రభుత్వమే బియ్యం, నూనె, కందిపప్పు, గుడ్లు, పాలు అందజేస్తుంది. చిన్నారుల సంఖ్యకు అనుగుణంగా ఎంతమేరకు సరుకులు అవసరమో నివేదిక అందజేస్తే ఆ మేరకు సరుకులు పంపిణీ చేస్తారు. కందిపప్పు, బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా అంగన్‌వాడీలు ప్రతి నెలా తెచ్చుకోవాల్సి ఉంటుంది. సరుకులు తరలించేందుకు, కేంద్రంలో జాగ్రత్తగా నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి నగదు చెల్లించదు.
కేటాయింపులు ఇలా...
ఒక్కో చిన్నారికి 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల నూనెను మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తుంది. నెలసరి కూరగాయల కోసం రూ.400 చెల్లిస్తోంది. గ్యాస్ సిలిండర్ కోసం నెలకు రూ.150 ఇస్తోంది. వీటితోనే చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సి ఉంటుంది.
పెరిగిన ధరలతో...
ప్రస్తుతం కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం కూరగాయల నిమిత్తం నెలకు కేటా యించే రూ.400 ఏ కోశానా సరిపోవడం లేదు. గ్యాస్‌కు సైతం నగదు సక్రమంగా చెల్లించడం లేదు. పలు సందర్భాల్లో సొంత సొమ్ము పెట్టి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మెనూ తప్పక పాటించాలని చెప్పే ఉన్నతాధికారులు పెరిగిన ధరలకు అనుగుణంగా నగదు మొత్తాన్ని మారిస్తే బాగుంటుందని అంగన్‌వాడీలు అంటున్నారు. దీపం పథకం కింద ఇస్తున్న ఉచిత గ్యాస్ అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా అందిస్తే ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మెనూ చార్జీలను పెంచితే తమకు ఊరటగా ఉంటుందని పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు కోరుతున్నారు.
కేంద్రాల నిర్వహణకు సొంత సొమ్ము...
అంగన్‌వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సబ్బులు, చీపుర్లు, చాపలు తదితర వస్తువుల కొనుగోలుకు ప్రభుత్వం నగదు అందజేయాలి. ప్రభుత్వం నుంచి ఇందుకు సొమ్ము అందకపోతుండటంతో అంగన్‌వాడీలు తమ సొంత సొమ్ము వెచ్చించి వీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.
భారీగా పెరిగిన కూరగాయలు, నిత్యావసరాల ధరలు పాత చార్జీలతోనే మెనూ అమలు చేయాలంటున్న ప్రభుత్వం అప్పులపాలవుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలు మెనూ చార్జీలు పెంచాలంటూ వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment