సాక్షిప్రతినిధి, వరంగల్/వాజేడు/ఏటూరునాగారం :జనావాసాలకు దూరంగా ప్రశాంతంగా ఉన్న ఆదివాసీ పల్లెలో అర్ధరాత్రి అలజడి రేగింది. ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు విసిరిన పంజాకు ఇద్దరు బల య్యారు. గురువారం రాత్రి ములుగు జిల్లా వాజేడు మండలం బాల లక్ష్మీపురం (పెనుగోలు కాలనీ)లో ఉయికె రమేశ్, అర్జున్‌లను మావోయిస్టులు గొడ్డళ్లతో నరికి చంపడం సంచలనం సృష్టించింది. పోలీస్ ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నందుకే ఖతం చేశామంటూ.. వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరిట మావోయిస్టులు లేఖలు వదిలారు. అంతకుముందు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలను సైతం హెచ్చరించిన నక్సల్స్.. ఇద్దరిని ఇన్‌ఫార్మర్ల పేరిట హతమార్చడంతో పోలీసుశాఖ అలర్టయ్యింది. టార్గెట్లు, ప్రజాప్రతినిధులు అటవీ ప్రాంతాల్లో తిరగవద్దని అప్రమత్తం చేశారు. రోజూ ఏదో ఒక చోట పోలీసులు తనిఖీలు చేస్తున్నప్పటికీ మావోయిస్టులు పక్కా ప్రణాళిక ప్రకారం.. ఈరెండు హత్యలను చేసి ఉంటారని ఆదివాసీలు చెబుతున్నారు. ఉయికె రమేశ్ ప్రభుత్వ ఉద్యోగి. పేరూరు గ్రామ పంచా యతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. తనకు వరుసకు తమ్ముడు అయ్యే అర్జున్ పశువుల కాపరితోపాటు కూలీ పనికి వెళ్లేవాడు. నిత్యం తమతో ఉండేవారు తెల్లారేసరికి రక్తపు మడుగులో ఉండడం చూసిన ఆదివాసీలు భీతిల్లారు.
చంపారిలా..
గురువారం రాత్రి 11 గంటల సమయంలో అర్జున్ ఇంటికి ముగ్గురు మావోయిస్టులు వచ్చారు. అతడిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి గొడ్డళ్లతో నరికారు. అదే సమయంలో మరో ముగ్గురు మావోయిస్టులు గ్రామ కార్యదర్శి అయిన రమేశ్ ఇంటికి వెళ్లి అడ్డుగా కట్టిన గుడ్డను కత్తులతో కోసి లోపలికి చొరబడ్డారు. బెడ్‌పై పడుకున్న రమేశ్‌ను గొడ్డళ్లతో నరికారు. కొన ఊపిరితో ఉండగా.. స్థానికులు ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యం చేస్తుండగానే చనిపోయాడు. రమేశ్‌కు భార్య రాంబాయి, ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉండగా, అర్జున్‌కు భార్య సావిత్రి, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మృతదేహాలను ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుట్టలపైనుంచి వచ్చి జీవనం..
పెనుగోలువాసులు గతంలో గుట్టలపై ఉండేవారు. అక్కడ ఏ పనీ లేకపోవడంతో అధికారుల సూచన మేరకు కిందికి దిగి వచ్చి పెనుగోలులో నివాసం ఉంటున్నారు. గుట్టలపై ఉన్నప్పుడు ప్రశాంతంగా జీవించామని, బతుకుదెరువు కోసం కిందికి దిగి వస్తే మావోయిస్టులు హత్యలు చేస్తారా? అని సూటిగా కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ బతకలేక అధికారుల ఒత్తిడితో గుట్టలు దిగి వస్తే తమను ఇక్కడ చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేవని, అలాంటి తమను హత్య చేయడం ఎంతవరకు సరైందని ప్రశ్నించారు.
ఏజెన్సీలో హై అలర్ట్
మావోయిస్టులు ఎవరినైనా చంపాలంటే శీతాకాలంలోనే చేస్తారు. ఈ మేరకు వారి టార్గెట్లను పూర్తి చేస్తుంటారు. వి పరీతమైన మంచు కురవడం, వారి కదలికలను కనిపెట్టే అవకాశం తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. ఇప్పటి వరకు జరిగిన ఇన్‌ఫార్మర్ హత్యలు నవంబర్, డిసెంబర్‌లోనే జరిగాయి. తాజాగా పెనుగోలు ఘటనే ఇందుకు నిదర్శనం. ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె), తాడ్వాయి, మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గూడూరు, గంగారం, బయ్యారం తదితర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం అందడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడే కూంబింగ్‌లు చేస్తూ అడవులను జల్లెడ పడుతున్నారు. కొత్త వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే వివరాలను సేకరిస్తున్నారు. గొత్తికోయగూడేలను సైతం పోలీసులు తరచూ తనిఖీలు చేస్తూ వారి ఆధార్‌కార్డులు, ఫొటోలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై డీజీపీ జితేందర్ కూడా శుక్రవారం ఎస్పీ, ఏఎస్పీలను ఆరా తీసినట్లు తెలిసింది. యాక్షన్‌లో పాల్గొన్న మావోయిస్టులు ఎందరు? ఎలా జరిగింది? అన్న కోణంలో అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
మా అన్న ఏ తప్పూ చేయలేదు..
నక్సల్స్ తప్పుడు సమాచారంతో మా అన్నను పొట్టన పెట్టుకున్నారు. ఎంతో కష్టపడితే 2019లో మా అన్నకు జాబ్ వచ్చింది. ఎలాంటి అవినీతి అక్రమాలు చేయకుండా నిజాయితీగా పనిచేస్తున్నాడు. ఎవరు ఏం చెప్పిండ్లో కానీ.. మా కుటుంబానికి తీరని అన్యాయం చేశారు. ఇలాంటి దుస్థితి ఎవరికీ రావొద్ద్దు.
– శంకర్, రమేశ్ సోదరుడు
ఇన్‌ఫార్మర్ పేరిట ఉయికె రమేశ్, అర్జున్‌ల హత్యతో కలకలం
రెండేళ్ల తర్వాత మావోయిస్టుల మరో ఘాతుకం
ఇన్‌ఫార్మర్లపై గురి..
ఉనికి చాటుకునేందుకు ప్రయత్నం
ప్రజాప్రతినిధులు, టార్గెట్లను
అలర్ట్ చేసిన పోలీసులు
సరిహద్దులో కూంబింగ్ ముమ్మరం..
వాజేడు ఘటనపై డీజీపీ ఆరా?
బతుకుదెరువు కోసం వస్తే హత్యలు చేస్తారా?
మావోయిస్టులను ప్రశ్నించిన గిరిజనులు
Comments
Please login to add a commentAdd a comment