దరఖాస్తుల ఆహ్వానం
బయ్యారం: గట్టుముసలమ్మ మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌లో తాత్కాలిక పద్ధతిలో సీఈఓగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కంపెనీ చైర్మన్ ఎస్.అరుణ, సెర్ప్ సీఈఓ నరసింహారావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్ డిప్లొమా, తత్సమాన అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ వరకు ఐకేపీ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు.
లోక్ అదాలత్‌ను
విజయవంతం చేయలి
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో డిసెంబర్ 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సురేష్ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై జిల్లా కోర్టు ఆవరణలో మహబూబాబాద్ సబ్ డివిజన్ పోలీసు అధికారులతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జడ్జి సురేష్ మాట్లాడుతూ.. కక్షిదారులు లోక్ అదాలత్‌ను వినియోగించుకుని ప్రశాంతంగా జీవించాలన్నారు. కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి, సబ్ డివిజనల్ పోలీసు అధికారి తిరుపతిరావు, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిలుకమారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
సుఖవ్యాధుల బారినపడొద్దు
నెహ్రూసెంటర్: అపరిచితులతో లైంగిక చర్య ప్రమాదకరమని, సుఖవ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ మురళీధర్ అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం వైద్యారోగ్యశాఖ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో ఇకపై అవసరమైనవారికి హెచ్‌ఐవీ స్క్రీనింగ్ చేయాలని సూచించారు. సంపూర్ణ సురక్ష కేంద్రంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులకు సంబంధించిన సేవలు ఉచితంగా లభిస్తాయని పేర్కొన్నారు. హెచ్‌ఐవీ సోకిన, ప్రభావితమైన వ్యక్తులపై వివక్ష చూపొద్దని, తప్పుగా ప్రవర్తించిన వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. సమావేశంలో ప్రొగ్రాం ఆఫీసర్లు సారంగం, సుధీర్‌రెడ్డి, విజయ్, శ్రవణ్‌కుమార్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ నితీష్, ఏఆర్‌టీ సెంటర్ మె డికల్ ఆఫీసర్ సురేందర్, డైక్ మెడికల్ ఆఫీసర్ వసుమతి, హెచ్‌ఐవీ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ జ్యోతి, ఎస్‌ఎస్‌కే మేనేజర్ రమేశ్, కౌన్సిలర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కోర్టులో ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం
మహబూబాబాద్ రూరల్: హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా వైద్యశాఖ వారి సహకారంతో జిల్లా కోర్టులో ప్రథమ చికిత్స కేంద్రాన్ని సీనియర్ సివిల్ జడ్జి సురేష్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు పరిపాలనాధికారి క్రాంతికుమార్ మాట్లాడుతూ.. కోర్టుకు వచ్చిన కక్షిదారులు వైద్య సేవలు పొందవచ్చన్నారు.
పంచారామాలకు
ప్రత్యేక బస్సు
నెహ్రూసెంటర్: కార్తీకమాసం సందర్భంగా మహబూబాబాద్ ఆర్టీసీ డిపో నుంచి భక్తుల సౌకర్యార్థం పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడుతున్నట్లు మేనేజర్ ఎం.శివప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 24న రాత్రి 7 గంటలకు డిపో నుంచి డీలక్స్ బస్సు పంచారామాలకు బయలుదేరి వెళ్తుందని, తిరిగి 26న రాత్రి మానుకోటకు చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.2,000, పిల్లలకు రూ.1,200 టికెట్ ధరగా నిర్ణయించామన్నారు. పూర్తి వివరాలకు 99592 26054, 94417 13896 నంబర్లలో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment