మహబూబాబాద్: మహిళల ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. పట్టణ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌జీలు కొనసాగుతున్నాయి. కాగా సంఘాలకు రుణాల మంజూరు, రికవరీలో మెప్మాలో పనిచేసే రిసోర్స్ పర్సన్(ఆర్పీ)లు కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే వారికి ఆరు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపాలిటీల్లో..
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో 90మంది ఆర్పీలు పని చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) కార్యాలయం కొనసాగుతోంది. కార్యాలయంలో డీఎంసీ, డాటా ఎంట్రీ ఆపరేటర్ విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, ఆర్పీలతో పాటు ఇద్దరు సీఎల్‌ఆర్పీలు(క్లస్టర్ రిపోర్స్ పర్సన్) పని చేస్తున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో 2,600 మహిళా సంఘాల్లో సుమారు 25,000పైగా సభ్యులు ఉన్నారు. వీరికి రుణాల మంజూరు, రికవరీ చేయడంతో పాటు ప్రభుత్వ పథకాల ప్రచారం, సర్వేలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే వీరికి ఆరు నెలలుగా వేతనాలు విడుదల కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
ఆరు నెలలుగా..
ఆర్పీలకు నెలకు రూ.6,000 వేతనం ఇస్తున్నారు. కాగా ఆరు నెలలుగా ప్రభుత్వం నుంచి వేతనాలు విడుదల కాలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషిస్తున్నామని, త్వరగా వేతనాలు విడుదల చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment