ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతి
● భార్య పరిస్థితి విషమం
జడ్చర్ల: జడ్చర్ల, కల్వకుర్తి ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల సమీపంలోని ప్రధాన రహదారిపై గంగాపూర్ శివారులో మిడ్జిల్ మండలం రెడ్డిగూడకు చెందిన జైపాల్ (45), శౌరిలమ్మతో దంపతులు మోటార్ బైక్‌పై వస్తుండగా.. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టారు. ప్రమాదంలో జైపాల్ అక్కడిక్కడే మృతి చెందగా.. అతడి భార్య తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు 108 వాహనంలో బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. శౌరిలమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు.
ట్రాక్టర్ కిందపడి
బాలుడి..
బిజినేపల్లి: మండల కేంద్రంలోని లింగమయ్య కాలనీలో ఏడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని లింగమయ్య కాలనీలో నివాసం ఉంటున్న రాములు, అనూష దంపతుల కుమారుడు నితిన్(7) పాఠశాలకు వెళ్లడానికి గురువారం ఉదయం రోడ్డు పైకి వస్తుండగా.. అటుగా వస్తున్న ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకుని డ్రైవర్ మహేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
కారు బోల్తా.. డ్రైవర్..
ఆర్మూర్ టౌన్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ శివారులోని జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో వనపర్తికి చెందిన కారు డ్రైవర్ ప్రకాశ్(18) మృతిచెందాడు. ఆర్మూర్ ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన మద్దెల చందు, ఆర్మూర్ మండలం కోటార్మూర్‌కు చెందిన అక్షయ్ స్నేహితులు. అక్షయ్ బంధువుల వివాహంలో పాల్గొనడానికి చందు హైదరాబాద్ నుంచి కారు అద్దెకు తీసుకొని వచ్చాడు. బుధవారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో డ్రైవర్ ప్రకాశ్‌తోపాటు మరో ఆరుగురు టీ తాగేందుకు కారులో వెళ్తుండగా.. పెర్కిట్ శివారులోని స్పీడ్ బ్రేకర్ వద్ద వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ ప్రకాశ్‌కు తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రకాశ్‌ను ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
గడ్డిమందు తాగి
యువకుడి బలవన్మరణం
మహమ్మదాబాద్: తన ప్రేమను కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదనే క్షణికావేశంతో గడ్డిమందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గండేడ్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెన్నాచేడ్ గ్రామానికి చెందిన తలారి అంజిలయ్య కుమారుడు తలారి బాల్‌రాజ్ (19) ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడంతో మనస్తాపానికి గురై ఈనెల 11న గడ్డిమందు తాగాడు. వెంటనే చికిత్స కోసం యువకుడిని మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం ఆస్పత్రిలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి అంజిలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మహమ్మదాబాద్ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు.
కొడుకు మందలించాడని తల్లి ఆత్మహత్య
ఖిల్లాఘనపురం: కల్లు తాగొద్దని కొడుకు మందలించడంతో మనస్థాపానికి ఓ తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మానాజీపేటలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సురేష్‌గౌడ్ గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన తలారి కాశమ్మ (68) తరుచుగా కల్లు తాగేది. కల్లు తాగొద్దని తల్లిని కుమారుడు మందలించాడు. దీంతో కా శమ్మ మనస్థాపంతో క్షణికావేశానికి గురై గ్రా మం సమీపంలో ఉన్న పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుమారు డు తలారి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పర్సనల్ లోన్ పేరిట సైబర్ మోసం
నాగర్‌కర్నూల్ క్రైం : పర్సనల్ లోన్ పేరిట సైబర్ నేరగాళ్లు వ్యక్తిని మోసం చేసిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్ తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రానికి చెందిన ఆకుతోట సాయిరామ్‌కు ఓ గుర్తు తెలియని సైబర్ నేరగాడు ఫోన్ చేసి పర్సనల్ లోన్ ఇస్తానని నమ్మించాడు. ఇదే క్రమంలో అతని నుంచి రూ. 99 వేలు అతని అకౌంట్‌లో వేయించుకున్నాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment