మూతబడులు
విద్యార్థులు లేరని ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తున్న అధికారులు
సాక్షి, నాగర్‌కర్నూల్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మెరుగైన విద్య అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఒకదిక్కు రూ.కోట్ల నిధులు వెచ్చించి.. కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు ప్రగల్భాలు పలుకుతుండగా.. మరోదిక్కు క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు లేరని అధికారులు శాశ్వతంగా తాళాలు వేస్తున్నారు. బడులను నడిపిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో భరోసా కల్పించాల్సిన అధికారులు.. విద్యార్థులు లేరన్న సాకుతో బడులను మూసివేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
జీరో ఎన్‌రోల్‌మెంట్ పేరుతో..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటికే చాలా వరకు పాఠశాలలకు శాశ్వతంగా తాళాలు పడ్డాయి. అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 73 పాఠశాలలను అధికారులు మూసివేశారు. ఈ విద్యా సంవత్సరం మధ్యలోనే 10 పాఠశాలలకు తాళం వేశారు. నిబంధనల ప్రకారం విద్యార్థుల జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్న పాఠశాలలనే తాత్కాలికంగా మూసివేయాలి. కానీ, చాలా పాఠశాలల్లో మూడు నుంచి పది మంది వరకు విద్యార్థులు ఉన్నా.. వారిని ఇతర పాఠశాలలు, ప్రైవేటుకు వెళ్లమని సూచిస్తూ.. అర్ధంతరంగా బడులను మూసేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీలు చోటుచేసుకోగా.. పట్టణాలు, సమీపంలోని పాఠశాలల్లోకి ఉపాధ్యాయులు ప్రాధాన్యం ఇచ్చారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు రాక, వచ్చిన వారు మళ్లీ సర్దుబాటు కోసం పైరవీలు చేసుకుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఉపాధ్యాయులు లేక ఖాళీగా ఉన్న పాఠశాలలను సైతం విద్యార్థుల జీరో ఎన్‌రోల్‌మెంట్ పేరుతో మూసేస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో 46, వనపర్తి జిల్లాలో 32, జోగుళాంబ గద్వాల జిల్లాలో 10, నారాయణపేట జిల్లాలో 35 ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి.
మూసివేసేందుకే ఆరాటం..
ఇన్నాళ్లు విద్యార్థులతో కళకళలాడిన బడులు.. ఉన్నట్టుండి బోసిపోతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ బడుల్లో నియామకం, వసతులు పెంచి తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించాల్సిన అధికారులు.. బడులను మూసివేసేందుకే ప్రాధాన్యం చూపుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు సంబంధిత అధికారులు చొరవ తీసుకుంటున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఉన్నా.. మరింత మందిని చేర్పించి, బలోపేతం చేయాల్సింది పోయి, ఉపాధ్యాయుల సర్దుబాటు, బదిలీల కోసం ఏకంగా బడులకే తాళాలు వేస్తుండటం గమనార్హం.
ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఇదే తంతు
అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 73 స్కూళ్ల మూసివేత
బల్మూరు మండలంలో ఒకే నెలలో మూడింటికి తాళం
ప్రభుత్వ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment