అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయాల కల్పన
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో శనివారం ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీల కనుగుణంగా మెనూ అమలు కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో డైట్ చార్జీల పెంపు మెనూ అమలు ప్రారంభ కార్యక్రమంం, గురుకుల, హాస్టల్ విద్యార్థుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, సంక్షేమ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు డైట్ చార్జీలు భారీగా పెంచిందని, ఇందుకనుగుణంగా డైట్ ప్లాన్ తయారు చేశామన్నారు. శనివారం నిర్వహించే కార్యక్రమంలో మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆలిండియా సర్వీస్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొంటారన్నారు. ప్రతి హాస్టల్, గురుకుల పాఠశాలలకు ప్రత్యేకాధికారులను నియమించామని చెప్పారు. సంబంధిత గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత 40 శాతం డైట్ చార్జీలు, 16 ఏళ్ల తర్వాత కాస్మొటిక్ చార్జీలను 200 శాతం పెంచిందన్నారు. పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీల వివరాలను తెలిపేలా బ్యానర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. గురుకుల విద్యార్థుల కోసం పౌష్టికాహారం అందిస్తుందన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతోపాటు ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. జిల్లాలోని జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గ్రూప్–2 పరీక్షలు
సాఫీగా నిర్వహించాలి
జిల్లాలో గ్రూప్–2 పరీక్షలను సాఫీగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. ఆది, సోమవారాల్లో జరగనున్న గ్రూప్–2 పరీక్షల నిర్వహణపై గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు అన్నిరకాల సదుపాయాలు కల్పించాలన్నారు. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని, అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment