రాజోళి: సరదాగా ఈతకు వెళ్లిన తండ్రీకొడుకులు సుంకేసుల డ్యాంలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం.. ఏపీలోని కర్నూలు జిల్లా లక్ష్మీనగర్‌కు చెందిన సులేమాన్(47) కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సుంకేసుల డ్యాంకు వచ్చారు. కొడుకులు ఫర్హాన్(11), ఫైజాన్(9)తో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు సుంకేసుల డ్యాం వద్ద నదిలోకి దిగారు.
అయితే ప్రమాదవశాత్తు ఇద్దరు నీటిలో కొట్టుకుపోతుండగా.. గమనించిన తండ్రి సులేమాన్ వారిని కాపాడేందుకు వెళ్లి నీటిలో మునిగిపోయాడు. అనంతరం డ్యాంలోని 25వ గేటు సమీపంలో వారి మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు మృతదేహాలను వెలికితీశారు. తండ్రీకొడుకులు ఒకే ఘటనలో మృతిచెందడంతో ఘటనా స్థలంలో ఉన్న కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు.
రామన్‌పాడులో 1016 అడుగుల నీటిమట్టం
మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో బుధవారం 1,016 అడుగులకు నీటిమట్టం చేరిందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా 550 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగిందని... సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. రామన్‌పాడు నుంచి ఎన్టీఆర్ కాల్వకు 22 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 83 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు.

సుంకేసుల డ్యాంలో పడి తండ్రీకొడుకులు మృతి