విద్యార్థులకు ఆరోగ్య ప్రశస్త్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ఆరోగ్య ప్రశస్త్‌

Published Fri, Sep 27 2024 1:24 AM | Last Updated on Fri, Sep 27 2024 1:24 AM

విద్యార్థులకు ఆరోగ్య ప్రశస్త్‌

● లోపాల గుర్తింపునకు ప్రత్యేకయాప్‌ ● రెండు విభాగాలుగా వివరాల నమోదు

మంచిర్యాలఅర్బన్‌: పాఠశాలలకు వచ్చే విద్యార్థుల్లో శారీరక, మానసిక వికలత్వంతోపాటు గుర్తించలేని లోపాలు, అనారోగ్య సమస్యలు ఉంటే వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇందుకోసం ఎస్‌సీఈఆర్టీ ప్రత్యేకంగా ప్రశస్త్‌ యాప్‌ను రూపొందించింది. ఉపాధ్యాయులు నేరుగా విద్యార్థులను పరిశీలించి యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. సమస్యలుంటే విద్యార్థులకు ఉన్నతస్థాయి వైద్యం అందేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ నెల 23న మండలాల వారీగా ప్రధానోపాధ్యాయులకు ఆర్పీలు శిక్షణ ఇచ్చారు. హెచ్‌ఎంలు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ప్రశస్త్‌ యాప్‌పై అవగాహన కల్పిస్తున్నారు. శిక్షణ పొందిన వారంతా ఆయా పాఠశాలల్లో పిల్లల వివరాలు నమోదు చేయనున్నారు. గురువారం నుంచి యాప్‌లో వివరాల నమోదు కార్యక్రమం ప్రారంభమైంది.

జిల్లాలో ఇలా..

జిల్లాలో 1090 పాఠశాలలు ఉండగా 1,22,847 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల వివరాలు ప్రశస్త్‌ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని పేరు, సర్వీస్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీ, చరవాణి నంబరు, యుడైస్‌కోడ్‌తో లాగిన్‌ కావాల్సి ఉంటుంది. ప్రశస్త్‌ యాప్‌లో పొందుపరిచిన విధంగా కొన్ని ప్రశ్నలు పిల్లలను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకొన్ని క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలి.

పార్ట్‌–1: ఈ నెల 26నుంచి అక్టోబర్‌ 26వరకు కొనసాగుతుంది. యాప్‌లో 64 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. బోధన సమయంలో పరిశీలించాల్సి ఉంటుంది. సరిగా చూస్తున్నాడా.. చదువుతున్నాడా..? అవయలోపం ఏముంది..? వి నికిడి లోపం ఉందా..? అర్థం చేసుకుంటున్నాడా..? అన్ని విషయాలు గమనించి నమోదు చేయాల్సి ఉంది. మొదటి రోజు గురువారం కొన్ని పాఠశాలల్లో ప్రారంభమైనా నమోదులో సాంకేతిక కారణాల వల్ల నత్తనడకన సాగినట్లు తెలుస్తోంది.

పార్ట్‌–2: అక్టోబర్‌ 27నుంచి నవంబర్‌ 14 వరకు కొనసాగిస్తారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించే ఉపాధ్యాయులు లోపం ఉన్న విద్యార్థుల వివరాలు నమోదు చేయనున్నారు. లోపాలను గుర్తించి వైద్యులకు సిఫార్సు చేయడంతో చికిత్స అందిస్తారు.

పకడ్బందీగా అమలు

ప్రశస్త్‌ యాప్‌ అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టాం. యాప్‌పై శిక్షణ పూర్తి చేశాం. వివరాలు పక్కాగా నమోదయ్యేలా చూస్తాం. ఉపాధ్యాయుడు బోధన చేస్తూ నెలరోజులపాటు ప్రతీ విద్యార్థిని స్క్రీనింగ్‌ చేస్తారు. మొదటి రోజు యాప్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. అన్నింటిని పరిష్కరిస్తూ పూర్తి వివరాల నమోదుకు చర్యలు చేపట్టాం.

– యాదయ్య, డీఈవో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement