క్లిక్‌ చేస్తే ఖాతా ఖాళీ! | - | Sakshi
Sakshi News home page

క్లిక్‌ చేస్తే ఖాతా ఖాళీ!

Published Sat, Dec 14 2024 1:24 AM | Last Updated on Sat, Dec 14 2024 1:24 AM

క్లిక

క్లిక్‌ చేస్తే ఖాతా ఖాళీ!

● ప్రజలను బురిడీ కొట్టిస్తున్న సైబర్‌ నేరగాళ్ల్లు ● ఏపీకే ఫైళ్లు పంపి మోసాలు ● అవగాహన కల్పిస్తున్న పోలీసులు ● తెలియని లింక్‌ల జోలికి వెళ్లొద్దని హెచ్చరిక

నిర్మల్‌టౌన్‌: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం బాగా పెరిగింది. డిజిటల్‌ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్‌ మోసాలు జోరుగా సాగుతున్నాయి. పండుగల వేళ సైబర్‌ నేరస్తులు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యాంకుల నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ క్షణాల్లో బ్యాంక్‌ ఖాతాలో ఉన్న డబ్బు మాయం చేస్తున్నారు. ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదేపదే సూచిస్తున్నా బాధితులు పెరుగుతూనే ఉన్నారు. అందరిని బురిడీ కొట్టించేలా ఫోన్‌ కాల్స్‌ చేయడం.. లాటరీ తగిలిందనో, తక్కువ ధరలో బ్రాండెడ్‌ వస్తువులు లభ్యమవుతున్నాయనో, ఏదో ఒక మెసేజ్‌ పంపి నకిలీ లింకులు చేరవేస్తూ.. ఆకర్షితులైన వారి ఖాతా నుంచి డబ్బులు కాజేస్తున్నారు.

పండుగల వేళ సైబర్‌ దోపిడీ..

పండుగలు వచ్చాయంటే చాలు.. సైబర్‌ నేరగాళ్లు ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నంలో ఉంటున్నారు. రానున్న క్రిస్మస్‌ పండుగ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. క్రిస్మస్‌ గ్రీటింగ్స్‌, మెసేజ్‌ల పేరిట సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడనున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. క్రిస్మస్‌ గిఫ్ట్‌ అంటూ.. వాట్సప్‌ గ్రూపుల్లో వచ్చే సందేశాలను పట్టించుకోవద్దని, అత్యాశతో లింకుపై క్లిక్‌ చేస్తే ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత డేటా చోరీ చేస్తారని పోలీసులు చెబుతున్నారు. క్రిస్మస్‌ శుభాకాంక్షలు పేరిట వచ్చే లింక్‌లపై క్లిక్‌ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు.

ఏపీకే ఫైళ్లతో ప్రమాదం..

సైబర్‌ నేరగాళ్లు ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజీ లేదా ఆండ్రాయిడ్‌ ప్యాకేజీ కిట్‌ (ఏపీకే) ఫైళ్లను వాట్సాప్‌ ద్వారా పంపుతున్నారు. వాటిని ఓపెన్‌ చేసి ఒకే అని క్లిక్‌ చేస్తే.. సంబంధిత వ్యక్తుల ఫోన్లు హ్యాకవుతున్నాయి. ఫలితంగా ఫోన్‌ నియంత్రణ సైబర్‌ నేరగాళ్ల చేతిలోకి వెళ్తుంది. ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందని తెలియని వారు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా సొమ్ము పంపితే వెంటనే హ్యాక్‌ చేసి, మొబైల్‌ నంబర్‌ ద్వారా పిన్‌ నంబర్‌ తెలుసుకుని నిమిషాల్లో సదరు వ్యక్తి బ్యాంకు ఖాతాలోని నగదు కాజేస్తున్నారు. హ్యాక్‌ చేసిన మొబైల్‌ డివైస్‌ డిస్‌ప్లే సైబర్‌ నేరగాళ్ల చేతిలో ఉంటుంది. దీని ప్రకారం ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్‌ నంబర్లకు ఫోన్‌ హ్యాకింగ్‌కు గురైన వ్యక్తి పంపినట్లు ఏపీకే ఫైళ్లు పంపుతున్నారు. ఏపీకే ఫైళ్ల లింక్‌ ఓపెన్‌ చేసిన వారు బ్యాంకు ఖాతాలో సొమ్ము కోల్పోతున్నారు. కొందరు నేరగాళ్లు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్‌ యోజన పథకం పేరిట లింక్‌ పంపుతున్నారు. ఈ లింక్‌ను ఓపెన్‌ చేసిన కూడా ఫోన్‌ హ్యాక్‌కు గురై బాధితుల బ్యాంకు అకౌంట్‌ నుంచి డబ్బులు కాజేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే అనవసర లింక్‌లను ఓపెన్‌ చేసి సైబర్‌ నేరగాళ్ల బారిన పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

సైబర్‌ నేరగాళ్లు పండుగలు వచ్చాయంటే దోపిడీ చేయడానికి కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజలు జాగ్రత్త వహించాలి. సైబర్‌ నేరగాళ్లు ప్రభుత్వ పథకాల పేరుతో లింక్‌లు పంపుతున్నారు. వాటిని ఓపెన్‌ చేస్తే సైబర్‌ నేరగాళ్ల మాయలో చిక్కినట్లే. ఎవరైనా సైబర్‌ మోసానికి గురైనా, ఫోన్‌ హ్యాక్‌కు గురై బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు పోగొట్టుకున్నా వెంటనే సైబర్‌క్రైం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కు లేదా సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.

– జానకీ షర్మిల, ఎస్పీ, నిర్మల్‌

జిల్లాలో సైబర్‌ నేరాలు..

నిర్మల్‌ జిల్లాలో 2022లో 41 సైబర్‌ నేరాలు జరగ్గా, 2023లో 17 జరిగాయి. 1 జనవరి 2024 నుంచి ఇప్పటివరకు మొత్తం 666 ఫిర్యాదులు రాగా.. 38 కేసులు నమోదయ్యాయి. పుట్‌ ఆన్‌ హోల్డ్‌ అయిన రూ.8,73,108ను పోలీసులు రికవరీ చేశారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, వివిధ పబ్లిక్‌ స్థలాలలో సైబర్‌ నేరాలపై మొత్తం 716 అవగాహన సదస్సులు నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
క్లిక్‌ చేస్తే ఖాతా ఖాళీ!1
1/1

క్లిక్‌ చేస్తే ఖాతా ఖాళీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement