అమ్మకు.. ఊయలే ఉరితాడై..
బెల్లంపల్లి: తన ముగ్గు రు సంతానంలో చిన్న కూతురును ఆడించేందుకు ఆ తల్లి ఇంట్లోనే చీరతో ఊయల కట్టింది. ప్రతీరోజు చిన్నారిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఊయల ఊగుతూ చిన్నారిని ఆడించింది. కానీ ఆ తల్లికి అప్పుడు తెలియలేదు తన పిల్లలను ఆడించే ఆ ఊయలే తన పాలిట యమపాశమవుతుందని. అనూహ్యంగా ఊయల కోసం కట్టిన చీర తన మెడకు చుట్టుకుని ఆ తల్లి ఆ చిన్నారుల నవ్వులకు శాశ్వతంగా దూరమైంది. వివరాల్లోకి వెళ్తే.. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి బెల్లంపల్లి బస్తీకి చెందిన పోచంపల్లి నీరజ(42)కు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె నవ్యశ్రీ, కుమారుడు ధనుశ్, చిన్న కూతురు 19 నెలల చిన్నారి సుచిత్ర ఉన్నారు. తన చిన్న కూతురు కోసం ఇంట్లో చీరతో ఊయల కట్టారు. గురువారం కొంచెం సేపు చిన్న కూతురు సుచిత్రతో కలిసి ఊయల ఊగింది. అనంతరం సుచిత్రను తన ఒడిలో నుంచి కిందకు దింపి కుమారుడు ధనుశ్‌కు ఊయల ఊగడం చూపిస్తూ ఒక్కసారిగా గుండ్రంగా తిరిగింది. నీరజ మెడకు ఆకస్మికంగా చీర చుట్టుకుని మెడకు గట్టిగా బిగుసుకుపోయింది. అది తెలియని చిన్నారులు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. అంతలోనే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన అత్త చూసే సరికి నీరజ మెడకు చీర ఉరిపడి ఆమె మృతిచెంది ఉంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో ఎన్.దేవయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment