సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వానాకాలం ధాన్యం ఆశించిన మేరకు కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. అకాల వర్షాలు, వాతావరణ మార్పులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలలుగా కొనుగోళ్లు జరుపుతున్నా.. కేంద్రాలకు మాత్రం ఆశించిన మేరకు ధాన్యం రావడం లేదు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే జిల్లాలో వరికోతలు అలస్యమవుతున్నాయి. జిల్లాలో మొత్తం 326 కేంద్రాలకు 317 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ వానాకాలం రైతులు ఎక్కువగా సన్నరకం ధాన్యమే సాగుచేశారు. అయితే అకాల వర్షాలు, వాతావరణ మార్పులు, నిబంధనల నేపథ్యంలో చాలా మంది ప్రైవేటుగా ధాన్యం విక్రయిస్తున్నారు. కేవలం దొడ్డు రకం మాత్రమే కేంద్రాలకు వస్తోంది. సేకరణ లక్ష్యం 3.26 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇప్పటి వరకు దొడ్డురకం 20 వేల మెట్రిక్ టన్నులు, సన్న రకం 4 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కేంద్రాలకు వచ్చింది. సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించినప్పటికీ ప్రైవేటులోనే ధర మెరుగ్గా ఉండడంతో రైతులు అధికంగా విక్రయిస్తున్నారు. గతేడాది ఈ సీజన్‌లో 1.39 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఈసారి ఆ మేరకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
పెరుగుతున్న మిల్లులు
సర్కారు విధించిన నిబంధనల మేరకు మొదట బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చేందుకు మిల్లర్లు ముందుకు రాలేదు. మరోవైపు గత సీజన్లలో బియ్యం బకాయిలు ఉన్న వారు క్రమంగా బియ్యం అప్పగిస్తున్నారు. దీంతో నిబంధన ప్రకారం ధాన్యం విలువకు పదిశాతం విలువను బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 21 మిల్లులు గ్యారెంటీ ఇస్తామని అండర్ టేకింగ్ ఫాంలు ఇచ్చారు. ఇందులో ఒకరిద్దరు బ్యాంకు గ్యారెంటీలు కట్టినట్లు సమాచారం. శుక్రవారం ఒక్కరోజే ఏడుగురు మిల్లర్ల ఇచ్చారు. దీంతో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ (కస్టం మిల్లింగ్‌రైస్)గా ఇచ్చేందుకు ఆ మిల్లులకు ట్యాగ్ చేశారు. మొదట మిల్లులు తక్కువగా ఉండడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ట్యాగింగ్ ఉన్న మిల్లులకే ధాన్యం తరలించారు. అయితే క్రమంగా మిల్లుల సంఖ్య పెరగడం కాస్త ఊరట కలిగిస్తోంది. కానీ బాయిల్డ్‌తో పోలిస్తే, రా మిల్లుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బకాయిలు తీర్చలేక, గ్యారెంటీలు ఇవ్వలేక సీఎంఆర్‌కు దూరంగా ఉంటున్నారు. మరోవైపు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో చలి పెరిగింది. పొగ మంచు, వాతావరణ మార్పులతో తేమ శాతంతో ఇబ్బందులు ఉన్నాయి. ఉదయం మంచు కారణంగా 17 శాతం కంటే అధికంగా వస్తున్నాయి. దీంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది.
కొనుగోలు కేంద్రాలు 317
సేకరణ లక్ష్యం
3.26 లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు చేసింది
25,418.16 మెట్రిక్ టన్నులు
దొడ్డు రకం
20,485.92 మెట్రిక్ టన్నులు
సన్న రకం
4,932.24 మెట్రిక్ టన్నులు
రైతులు 1,618 మంది.
చెల్లించిన మొత్తం రూ.24.74 కోట్లు
రైతులే మిల్లింగ్
చాలా మంది రైతులు సన్నరకం సాగుచేసిన వారు సొంతంగా ధాన్యాన్ని మరాడించి బి య్యంగా మార్చి అమ్ముతున్నారు. తమ ఇంటి, బంధువులు, తెలిసిన వారికి కోసం పోను మిగతా ధాన్యం బియ్యంగా మార్చి గ్రామాలు, పట్టణాల్లో విక్రయిస్తున్నారు. సన్నరకం, బియ్యం నాణ్యతను బట్టి ధర చెల్లిస్తున్నారు. ఇక రైతు సంఘాలు సైతం మిల్లింగ్ చేసి బి య్యం అమ్మకాలు చేస్తున్నాయి. దీంతో శ్రమ కు తగినట్లుగా ఫలితం ఉంటున్నట్లు రైతులు చెబుతున్నారు.
సజావుగా కొనుగోళ్లు
బ్యాంకు గ్యారెంటీలు ఇస్తామని ముందుకు వచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయిస్తున్నాం. అయితే ధాన్యం కేంద్రాలకు రావడం చాలా వరకు తగ్గింది. సన్నరకం ఎక్కువ బయటనే అమ్మకాలు సాగుతున్నాయి. కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా కొనుగోళ్లు సాగుతున్నాయి.
– సబావత్ మోతీలాల్, అడిషనల్ కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment