
డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు, హీరో ఆది ఉగాది పండగ రోజు కొత్త సినిమా మొదలు పెట్టారు. హీరోయిన్ సిమ్రత్ కౌర్ కథానాయిక. భాస్కర్ బంటుపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను టి విజయ్ కుమార్ రెడ్డి సమర్పణలో శిఖర క్రియేషన్స్ పతాకంపై యుగంధర్ టీ (గుడివాడ యుగంధర్) నిర్మిస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగల పద్మారావు గౌడ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నిర్మాత పిల్లలు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, సంజయ్ మెఘా, అరుంధతి గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. "శిఖర ప్రొడక్షన్స్ బ్యానర్ లో మంచి సినిమా తీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నటించిన అందరికీ మంచి పేరు రావాలని కోరుకొంటున్నాను. ఈ సినిమాకు సంబంధించి నిర్మాత (గుడివాడ యుగంధర్)కు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా నేను వెనుకాడకుండా ముందుంటానని అందరి ముందు హామీ ఇస్తున్నాను" అని అన్నారు.
దర్శకుడు భాస్కర్ బంటుపల్లి మాట్లాడుతూ.. "ఇది నా రెండవ సినిమా. నిర్మాత నా కథ విన్న వెంటనే నాపై నమ్మకం ఉంచి నాకీ అవకాశం ఇచ్చారు, అందుకు ఆయనకు ధన్యవాదాలు. ఇప్పటివరకూ ఆది సాయికుమార్ తన కెరీర్లో చేయని విభిన్నమైన పాత్రను పోషిస్తున్నాడు. ఆదికి ఈ కథ చెప్పిన వెంటనే కథ నచ్చి ఒప్పుకున్నారు. అలాగే బ్యాక్ ఎండ్‌లో ఉండి నాకు సపోర్ట్ చేసిన సాయికుమార్ కి ధన్యవాదాలు. రెగ్యులర్ షూటింగ్ మే నుంచి స్టార్ట్ చేసి సినిమాను రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తాము" అన్నారు.
నిర్మాత యుగంధర్ మాట్లాడుతూ... ‘కర్ణాటక డిస్ట్రుబ్యూటర్ అయిన నేను ప్రొడక్షన్ నంబర్ 1 స్టార్ట్ చేసి ఈ సినిమా తీస్తున్నాను. ఇకపై నా బ్యానర్ పై చాలా చిత్రాలు వస్తాయి. నా బ్యానర్‌లోని ప్రతి సినిమా నుంచి వచ్చిన డబ్బులో కొంత భాగం పేద విద్యార్థులకు ఉపయోగిస్తాను. నేను సినిమాలు తీయడానికి కూడా ముఖ్య కారణం కూడా అదేన’ని అన్నారు.