
డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఫుల్ జోష్‌లో ఉన్నాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (siddhu jonnalagadda). హ్యాట్రిక్ హిట్ కోసం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జాక్’తో నేడు(ఏప్రిల్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి సిద్ధు ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడిందా లేదా రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
పాబ్లో నెరుడా అలియాస్ జాక్ (సిద్ధు జొన్నలగడ్డ) రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్ కావాలని కలలు కంటాడు. తనకున్న టాలెంట్ అంతా ఉపయోగించి ఇంటర్వ్యూ వరకు వెళ్తాడు. ఆ రిజల్ట్ రాకముందే ఖాలీగా ఉండడం ఎందుకని దేశాన్ని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడు. ఉగ్రవాదులు, హైదారాబాద్‌తో పాటు భారత్‌లోని ఇతర ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారనే విషయం తెలుసుకొని వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు.
మరోవైపు జాక్ ఏం పని చేస్తున్నాడో కనుక్కోమని ప్రైవేట్ డిటెక్టివ్ అఫిషాన్ బేగం (వైష్ణవి చైతన్య)కు లక్ష రూపాయలు ఇస్తాడు అతని తండ్రి పాన్ ఇండియా ప్రసాద్(నరేశ్). అఫిషాన్ బేగం భానుమతి పేరుతో జాక్‌కి దగ్గరై జాక్ పనిపై నిఘా పెడుతుంది. టెర్రరిస్టులను పట్టుకునే క్రమంలో పొరపాటున ‘రా’ఏజెంట్ మనోజ్(ప్రకాశ్ రాజ్)ని కిడ్నాప్ చేస్తాడు జాక్. ఆ తర్వాత ఏం జరిగింది? టెర్రరిస్ట్ గ్యాంగ్‌ని జాక్ పట్టుకోగలిగాడా లేదా? అసలు జాక్ ‘రా’ ఏజెంట్ కావాలని ఎందుకు అనుకున్నాడు? చివరకు తను కోరుకున్న ఉద్యోగం పొందగలిగాడా లేదా? అనేదే తెలియాలంటే జాక్(Jack Movie Review) సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఒక శిలై ఉన్నానని భూమి కుంగునా?
నేనొక శిల్పానని దైవం తుళ్లునా?
మలిచిన శిల్పం, మలచని రాయి ఈ రెంటిలోన గొప్పది ..శిల్పమా? శిలా?
ఏ జవాబు అందినా పోరు ఆగేదేనా..? రెండిటి మధ్యన..!.. సినిమా ఎండింగ్‌లో బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన ‘రాయి – శిల్పం’ థియరీ ఇది. ఇందులో నిజంగానే ఏది గొప్పదో చెప్పలేం కానీ ఈ సినిమా విషయంలో మాత్రం శిల్పి(దర్శకుడు) లోపం చాలానే ఉంది. మంచి రాయి( హీరో) ఉన్నప్పటికీ దాన్ని అందమైన శిల్పంగా మార్చడంలో తడబడ్డాడు.
బొమ్మరిల్లు భాస్కర్ తన స్టైల్ కథను పక్కకు పెట్టి తీసిన సినిమా ఇది. ఇంట్రెస్టింగ్ పాయింట్ రాసుకున్నాడు. హీరో పాత్రను కూడా ఆసక్తికరంగానే తీర్చిదిద్దాదు. కానీ కథనం విషయంలో జాగ్రత్త పడలేదు. దేశానికి ముందుడి ప్రమాదం రాకుండా ఆపేదే ‘రా’ అంటూ ‘రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్’ గురించి గొప్పగా చెప్పిన భాస్కర్.. కథలో మాత్రం ‘రా’ ఏజెంట్లను కమెడియన్ల కంటే తక్కువ చేసి చూపించారు. ‘రా’ , ఉగ్రవాదం ..ఇలాంటి కథలను సీరియస్‌గా చెప్తేనే ఆసక్తికరంగా ఉంటుంది. కానీ భాస్కర్ సీరియస్ సబ్జెక్ట్ ఎంచుకొని దానికి కామెడీ టచ్ ఇచ్చాడు. ఇది పూర్తిగా సఫలం కాలేదు. మదర్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ.. దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయాడు.
‘వీడు కొంచెం క్రాక్’ అని సినిమాకు పెట్టిన ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగానే హీరో క్యారెక్టర్‌ని మలిచాడు. ఫస్టాఫ్ అంతా ఫన్‌వేలో నడుస్తుంది. ఉగ్రవాదులను పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నం క్రాక్‌గానే అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో బలమైన సన్నివేశాలు లేనప్పటికీ స్క్రీన్‌ప్లేతో నెట్టుకొచ్చాడు. ఇంటర్వెల్ సీన్ అయితే మరీ సిల్లీగా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. నేపాల్ ఎపిసోడ్ కొంతమేర ఆకట్టుకున్నా.. టెర్రరిస్టులతో జరిగే యాక్షన్ డ్రామా రక్తి కట్టించదు. బలమైన కథ లేకపోవడంతో ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ శిల్పాన్ని మరింత అందంగా చెక్కాల్సింది.
ఎవరెలా చేశారంటే..
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో యూత్‌ని ఆకట్టుకున్న సిద్ధు..మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కొంచెం క్రాక్ ఉన్న జాక్ పాత్రకు న్యాయం చేశాడు. తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. క్లైమాక్స్‌లో ఫైట్ కూడా చేశాడు. అయితే జాక్ మాటలు, బిహేవియర్ చూస్తే ‘టిల్లు’ వద్దన్నా గుర్తుకు వస్తాడు. వైష్ణవి చైతన్య కు స్క్రీన్ స్పేస్ ఎక్కువే ఉన్నప్పటికీ ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు. నటన పరంగాను మెప్పించడానికి అక్కడ స్కోపే లేదు. ఏదో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఆ క్యారెక్టర్‌ని డిజైన్ చేశారు.
‘రా’ ఏజెంట్ మనోజ్‌గా ప్రకాశ్ రాజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఆయన పాత్రను అటు సీరియస్‌గాను..ఇటు పూర్తి కమెడియన్‌గాను మల్చలేక రెండింటికి మధ్య ఊగిసలాడేలా తీర్చిదిద్దారు. సుబ్బరాజు పాత్ర కూడా అంతే. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. పాటలు అంతగా గుర్తుపెట్టుకునేలా ఉండవు కానీ నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.