వెంకటాపురం(కె): మండల పరిఽధిలోని బెస్తగూడెం గ్రామ శివారులో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బెస్తగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు వద్దకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కూలీలు పనికోసం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. గతనెల 31మంచినీటిని తెచ్చుకునేందుకు బాలిక బోరు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన రాజశేఖర్ (బీజేపీ మండల అధ్యక్షుడు) తన ద్విచక్రవాహనంపై రైతు ఇంటికి తీసుకెళ్తానని చెప్పి బాలికను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్తున్నాడు. గమనించిన బాలిక బైక్‌పై నుంచి దూకి రైతు ఇంటికి చేరుకుంది. ఈ మేరకు బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
హైస్కూల్ ఎదుట క్షుద్ర పూజలు
వెంకటాపురం(ఎం): మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదుట మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. పాఠశాల ఎదుట ముగ్గు వేసి పసుపు, కుంకుమ పెట్టి నిమ్మకాయలు, ఎండు మిర్చి పెట్టారు. బుధవారం పదో తరగతి సాంఘీకశాస్త్రం పరీక్ష ఉండడంతో విద్యార్థులు పాఠశాలకు వచ్చి ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంకటాపురం ఎస్సై సతీష్ సంఘటనా స్థలానికి చేరుకొని ముగ్గును చెరిపివేశారు. మూఢ నమ్మకాలను నమ్మవద్దని ఎస్సై పిలుపునిచ్చారు.
భూముల అమ్మకాల నిర్ణయం విరమించుకోవాలి
ములుగు రూరల్: హెచ్‌సీయూ భూముల అమ్మకాల నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలో ప్రజా సంఘాల భవన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.యూనివర్సిటీలో ధర్నా నిర్వహించకూడదని ఇచ్చిన సర్క్యులర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని అమ్మకూడదని హెచ్చరించారు. అదే విధంగా ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సిన భూమి ని అమ్మాలనుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ, గణేశ్, వీరబాబు, కృష్ణబాబు, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందంగా గడపాలి
భూపాలపల్లి: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి, విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సుదీర్ఘకాలం పోలీసు శాఖకు సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఎస్సై పోరిక లాల్ సింగ్‌ను జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఎస్పీ సత్కరించి, కానుక అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎలాంటి రిమార్కులు లేకుండా సర్వీసును పూర్తి చేసి పదవీ విరమణ పొందడం అభినందనీయం అన్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ.. ప్రజలకు సేవలు అందించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1987వ సంవత్సరంలో లాల్ సింగ్ పోలీసు కానిస్టేబుల్‌గా పోలీసుశాఖలోకి అడుగుపెట్టి దాదాపు 38 సంవత్సరాలపాటు సేవలు అందించారని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో తనవంతు పాత్రను పోషించడం అభినందనీయమని కొనియాడారు.
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు షురూ
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ (అటానమస్)లో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల రెండు, నాలుగో, ఆరో సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల నిర్వహణ తీరును కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, ఆ కాలేజీ పరీక్షల నియంత్రణాధికారి సుధీర్ అధ్యాపకుడు సాయిచరణ్ పరిశీలించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు కొన సాగాయి.

పోక్సో కేసు నమోదు