నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల సర్వే
నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను మంగళవారం నుంచి అధికారులు పరిశీలించనున్నారు. ప్రతి దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి వారి వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇందిరమ్మ కమిటీలు పర్యవేక్షించనున్నాయి. పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపల్ వార్డుల్లో వార్డు ఇన్‌చార్జిలు సర్వే చేపట్టనున్నారు. సర్వే ఏ విధంగా చేయాలనే విషయంపై వారికి సోమవారం శిక్షణ ఇచ్చారు. మంగళవారం ఆయా గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో సర్వే ప్రారంభించి ఈ నెలాఖరులోగా పూర్తయ్యేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
ప్రజాపాలనలో దరఖాస్తులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తానని సొంత ప్లాట్ ఉన్న వారికి మొదటి అవకాశం కల్పిస్తామని చెప్పింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లాలో 4.36 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులన్నింటినీ ప్రత్యేక యాప్‌కు అనుసంధానం చేసింది. ఇప్పుడు ఆయా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను యాప్‌లో నమోదు చేయనున్నారు.
సర్వేలో వివరాలు సేకరణ ఇలా..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు చేసిన వారి వివరాలను ఆన్‌లైన్ చేశారు. ఇప్పుడు జిల్లాలోని 844 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు 8 మున్సిపాలిటీల పరిధిలో 182 వార్డుల్లో వార్డు ఇన్‌చార్జిలకు ఇందిరమ్మ ఇళ్ల సర్వే బాధ్యతను అప్పగించారు. వారు తమ సెల్‌ఫోన్లలో ఆ యాప్‌ను ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్నారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను ఆ యాప్‌లో నమోదు చేయనున్నారు. మీకు సొంత ఇల్లు ఉందా.? లేదా కిరాయి ఇంట్లో ఉంటే అది రేకుల ఇల్లా.. లేక స్లాబా, ఆ ఇంటి ఫొటో తీసుకోనున్నారు. ఎంత మంది కుటుంబ సభ్యులున్నారు, వారికి ఏవైనా భూములు, ప్లాట్లు ఉన్నాయా అనే వివరాలు పరిశీలించి నమోదు చేయనున్నారు. కార్లు, ఇతర ఆస్తుల వివరాలు ఆధార్ అనుసంధానంతో ఆన్‌లైన్‌లో కనిపించినప్పటికీ గతంలో వాహనాలు ఉండవచ్చు, ప్రస్తుతం అమ్మవచ్చు అందువల్ల మళ్లీ సంబంధిత దరఖాస్తుదారులను అడిగి ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. గతంలో ఇందిరమ్మ ఇల్లు పొందారా అనే వివరాలను కూడా తెలుసుకుని నమోదు చేయనున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్వే
జిల్లాలో 4.36 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయా దరఖాస్తులను మంగళవారం నుంచి పరిశీలించనున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివరాలు నమోదు చేసుకుంటాం. మొదటగా స్థలం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. సర్వేకు వెళ్లిన సందర్భంలో దరఖాస్తుదారుడికి ప్రస్తుతం స్థలం ఉందా ఉన్న ఇంటిని తొలగించి నిర్మించుకుంటారా అనే వివరాలు సేకరిస్తాం. ఈ నెల చివరి నాటికి సర్వే పూర్తి చేయాల్సి ఉంది.
– హౌజింగ్ పీడీ రాజ్‌కుమార్
ఫ దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాల సేకరణ
ఫ ప్రత్యేక యాప్‌లో నమోదు చేయనున్న సిబ్బంది
ఫ పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో వార్డు ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో సర్వే
నెలాఖరులోగా పరిశీలన
పూర్తి చేయాలి : కలెక్టర్
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనను ఈ నెలాఖ రులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆమె సంబంధిత జిల్లా, మండల స్థాయి అధికారులతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లాలో మొత్తం 4,31,831 దరఖాస్తులు వచ్చాయని.. ఆయా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, గృహ నిర్మాణ పీడీ రాజ్‌కుమార్, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ఈడీఎం దుర్గారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment