పశువుల దాణాగా బాలామృతం!
భువనగిరిటౌన్ : జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పలువురు పాడి రైతులు బాలామృతం కొనుగోలు చేసి గేదెలకు, ఆవులకు దాణాగా వినియోగిస్తున్నారు. చిన్నారులకు చేరాల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతున్నా ఐసీడీఎస్ అధికారులు పట్టించుకోవడం లేదు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని బహేర్‌పేటలో చీమల నరేష్ పాశువుల పాకలో 9 బస్తాల బాలామృతాన్ని మంగళవారం భువనగిరి పట్టణ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తక్కువ ధరకు రావడంతోపాటు పశువులు పాలు సమృద్ధిగా ఇస్తుండడంతో అంగన్‌వాడీ కేంద్రాల వద్ద, మోత్కూర్‌కు చెందిన బీస ప్రశాంత్ వద్ద భువనగిరికి చెందిన చీమల నరేష్ బాలామృతం కొనుగోలు చేసి పశువులకు దాణాగా వేస్తున్నాడు. కాగా పోలీసులు నరేష్‌ను పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ సురేష్‌కుమార్ తెలిపారు.
బస్తాకు రూ.200 చొప్పున విక్రయం
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులకు ఎంతో కొంత నగదు ఇచ్చి బాలామృతం ప్యాకెట్లను పలువురు కొంటున్నారని సమాచారం. జిల్లావ్యాప్తంగా ఇలా చిన్నారులకు అందాల్సిన బాలామృతం పక్కదారి పడుతుండడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. బాలామృతం ప్యాకెట్లు చెత్తకుప్పల్లో కనిపిస్తున్నా.. పశువులకు దాణాగా వినియోగిస్తున్నా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు మండిపడుతున్నారు. భువనగిరి పట్టణంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక బస్తా రూ.200 చొప్పున అమ్ముతున్నారని సమాచారం. కాగా ఒక బస్తాలో 8 బాలామృతం ప్యాకెట్లు.. ఒక్కొక్క ప్యాకెట్‌లో 2 కిలోల చొప్పున పౌష్టికాహారం ఉంటుంది.
పర్యవేక్షణ లేకనే..
అంగన్‌వాడీ కేంద్రాల్లో పేరు నమోదు చేసుకున్న చాలామంది లబ్ధిదారులు కేంద్రాలకు వెళ్లి ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని తీసుకోవడం లేదు. దీంతో కేంద్రాలకు వచ్చే కోడిగుడ్లు, బాలామృతం, పాలు తదితర పౌష్టికాహార సరుకులు పక్కదారి పడుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, రామన్నపేట, మోత్కూర్ ప్రాజెక్టుల పరిధిలో 901 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. వీటి పర్యవేక్షణకు సూపర్‌వైజర్లు, సీడీపీఓలతోపాటు జిల్లా సంక్షేమ అధికారి ఉంటారు. ఎక్కువగా సూపర్‌వైజర్లే తమ పరిధిలోని అంగనవాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు అందించే పౌష్టికాహరం, ప్రీ స్కూల్ విద్య, రోజువారీ హాజరు, తదితర అంశాలను పర్యవేక్షిస్తుంటారు. అయినా పౌష్టికాహారం పక్కదారి పడుతోందంటే కారణమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరు అంగన్‌వాడీ టీచర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుండగా.. మరికొందరు మాత్రం సంబంధిత అధికారులకు తొత్తులుగా మారి తమను ఎవ్వరూ ఏమీ చేయలేరనే ధీమాతో స్వయంగా తమ పరిధిలోని కేంద్రాల నుంచి సరుకులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇకనైనా అధికారులు అంగన్‌వాడీ కేంద్రాల్లో పక్కదారి పడుతున్న పౌష్టికాహారంపై దృష్టి పెట్టాలని, బాలామృతం పశువులపాలు కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లాలోని పలువురు కోరుతున్నారు.
కోరుతున్నారు.
భువనగిరిలోని పశువుల పాకలో 9 బస్తాలు పట్టుకున్న పోలీసులు
పక్కదారి పడుతున్న పౌష్టికాహారం
పట్టించుకోని ఐసీడీఎస్ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment