వరి నారుమడిలో యాజమాన్య పద్ధతులు
నడిగూడెం : వానాకాలం సీజన్ వరి కోతలు ఓవైపు పూర్తి కావొస్తున్నాయి మరోవైపు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు రైతులు, బోర్లు, బావులు, చెరువుల కింద రైతులు యాసంగి వరి నారుమడి పెంపకంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో చలి తీవ్రత బాగా ఉంటుందని, నారుమడి యాజమాన్యంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని నడిగూడెం మండల వ్యవసాయ అధికారి రాయపు దేవప్రసాద్ చెబుతున్నారు. వరి నారుమడిలో యాజమాన్య పద్ధతులపై సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే..
చలి సమస్యను అధిగమించడానికి..
యాసంగిలో దమ్ము చేసే నారుమడిలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండాజిమ్‌ను తడితో పట్టించి, ఆరబెట్టి విత్తనాలను నారుమడిలో చల్లుకోవాలి. రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ కంటె తగ్గినప్పుడు, చలి తీవ్రత పెరిగి సరిగా నారు ఎదగక ఎర్రబడి, కొన్నిసార్లు చనిపోతుంది. రెండు గుంటల నారుమడికి రెండు కిలోల నత్రజని (ఒక కిలో విత్తనం చల్లేముందు, మరో కిలో 12–14 రోజులకు) ఒక కిలో భాస్వరం, ఒక కిలో పొటాషం ఇచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. పశువుల పేడ లేదా రెండు క్వింటాళ్లు మాగిన కోళ్ల ఎరువు లేదా గొర్రెల ఎరువు లేదా వర్మీ కంపోస్టు వేసి కలియదున్నాలి. చలి సమస్యను అధిగమించడానికి.. నారుమళ్లపైన ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రలతో ఊతం ఇచ్చి, పైన పలుచని పాలిథిన్ షీట్ లేదా పాలీపూవెన్ యూరియా బస్తాలతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం వేళల్లో కప్పి ఉంచాయి. మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తీసివేయాలి. యాసంగిలో జింకు లోప లక్షణాలు ఎక్కువగా కనపడతాయి. కాబట్టి జింకు లోపాన్ని సవరించాలి. జింకు సల్ఫేట్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నారు ఆరోగ్యంగా పెరగడానికి పైపాటుగా యూరియాకి 2 గ్రాముల కార్బండాజిమ్, మాంకోజెబ్ మిశ్రమ మందును కలిపి వేసుకోవాలి. రాత్రి వేళల్లో నీరు నిండుగా ఉంచి తెల్ల వారుజామున తీసివేసి కొత్త నీరు పెట్టాలి.
రైతులకు నడిగూడెం ఏఓ
రాయపు దేవప్రసాద్ సూచనలు
Comments
Please login to add a commentAdd a comment