పశు ఔషధ బ్యాంకుకు మందులు విరాళం
కోదాడ రూరల్ : కోదాడ పట్టణంలోని పశు వైద్యశాలలో ఏర్పాటు చేసిన ఔషధ బ్యాంకుకు నియోస్పార్క్ వెటర్నరీ మందుల కంపెనీకి చెందిన ప్రతినిధులు రూ.26,733 విలువ చేసే మందులను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా మంగళవారం కోదాడ ప్రాంతీయ పశు వైద్యశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య మాట్లాడుతూ కోదాడ ప్రాంతీయ పశు వైద్యశాలలో ఏర్పాటు చేసిన పశు ఔషధ బ్యాంకుకు మందులను విరాళంగా ఇచ్చేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. పశుపోషకులు మందుల కొనుగోలుకు ఇబ్బంది పడకుండా ఈ ఔషధ బ్యాంకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాతలు మరికొందరు ముందుకు వస్తే కోదాడ ప్రాంతంలోని మూగజీవాలకు ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ దక్షిణ తెలంగాణ ఏరియా మేనేజర్ చల్లా వెంకటేష్, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది చంద్రకళ, పాడి రైతులు ఉన్నారు.
విద్యార్థి అదృశ్యం
హుజూర్‌నగర్ : విద్యార్థి తప్పిపోయిన సంఘటన హుజూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. హుజూర్‌నగర్‌కు చెందిన కూరగాయల వ్యాపారి సైదిరెడ్డి కొడుకు లోకేష్‌రెడ్డి స్థానిక ప్రైవేటు స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. లోకేష్‌రెడ్డి సోమవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటి వచ్చే క్రమంలో పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో బస్సు ఎక్కి ఎటో వెళ్లిపోయాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సైదిరెడ్డి తెలిపారు. తన కొడుకు సమాచారం తెలిస్తే 9676546388, 9963776388, 98485 81888 నంబర్లకు తెలియజేయాలని కోరారు.
జారిపడి బాలిక మృతి
చింతపల్లి: ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన మంగళవారం చింతపల్లి మండల పరిధిలోని కుర్మపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుర్మపల్లి గ్రామానికి చెందిన ఉడుగుంట్ల విఠల్–శిరీష దంపతుల రెండో కుమార్తె హన్సిక (3) కురుమేడు గ్రామంలోని నలంద పాఠశాలలో నర్సరీ చదువుతోంది. రోజు మాదిరిగానే పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఇంట్లో కాలు జారి మెట్ల మీద పడడంతో తలకు బలమైన గాయమైంది. చికిత్స నిమిత్తం మాల్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
స్వర్ణగిరి శ్రీవారిని
దర్శించుకున్న వీహెచ్
భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని మంగళవారం మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు దర్శించుకున్నారు. ఆలయంలో వీహెచ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయం ధర్మకర్త మురళి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment