చౌటుప్పల్ : ఇంటి ఎదుట నిల్చున్న మహిళ మెడలోనుంచి గుర్తు తెలియన దుండగులు బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. ఈ ఘటన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని హనుమాన్‌నగర్ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన గుర్రం భార్గవి తన ఇంటి ఎదుట నిల్చున్న సమయంలో పల్సర్ బైక్‌పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చారు. తమ సెల్‌ఫోన్‌లో ఒక వ్యక్తి ఫొటోను చూపించి అతడిని ఎక్కడైనా చూశారా అని అడిగారు. తాను చూడలేదని మహిళ సమాధానం చెప్పింది. అనంతరం తన పనిలో నిమగ్నమవుతున్న క్రమంలో బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి మహిళ మెడలో ఉన్న రెండున్నర తులాల విలువైన బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. తేరుకున్న మహిళ సదరు దుండగులను పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ తప్పించుకుని పోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ మన్మథకుమార్ తెలిపారు.
ఇద్దరు దొంగల అరెస్ట్
చిట్యాల: పట్టణంలో ఈ నెల 4వ తేదీన ఓ ఇంట్లోకి దూరి మహిళ మెడలో బంగారు పుస్తెల తాడు లాక్కెళ్లిన ఇద్దరు దొంగలను పట్టుకుని రిమాండ్‌కు పంపించినట్లు నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, చిట్యాల ఎస్‌ఐ ఎన్.ధర్మా మంగళవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలంలోని వనిపాకల గ్రామానికి చెందిన మేడి సంతోష్‌కుమార్, బర్రె శ్రీను విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాందించాలనే ఉద్దేశంతో దొంగతనం చేయాలనుకున్నారు. ఈ నెల 4వ తేదీన చిట్యాల పట్టణంలోని చేపూరి సత్తిరెడ్డి ఇంట్లో ఆయన భార్య ప్రేమలత ఒంటరిగా ఉండగా పెప్పర్ స్ప్రేతో వీరిద్దరు కలిసి దాడి చేశారు. అనంతరం ఆమె ముఖంపై దాడి చేసి గాయపరిచి ఆమె ఒంటిపై గల ఐదు తులాల బంగారు పుస్తెల తాడు లాక్కొని పరారయ్యారు. బాధితురాలు చిట్యాల పోలీస్‌స్టేషన్‌లో అదేరోజు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీకి పాల్పడిన సంతోష్‌కుమార్, శ్రీనును చిట్యాలలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారి వద్ద మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి ఐదు తులాల బంగారు పుస్తెల తాడుతోపాటుగా రెండు బైక్‌లు, రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని రిమాండ్ చేసినట్లు సీఐ, ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment