కిలోన్నర గంజాయి పట్టివేత
సూర్యాపేట టౌన్ : గంజాయి అమ్మేందుకు ప్రయత్నిస్తున్న యువకుడిని పట్టుకుని కిలోన్నర గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ రవి తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఈ నెల 9న పట్టణ సీఐ వీరరాఘవులు ఆదేశాల మేరకు ఎస్‌ఐ ఏడుకొండలు తన సిబ్బందితో కలిసి సూర్యాపేట పట్టణంలోని భీమారం రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి అనుమానాస్పందంగా బైక్‌పై వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకుని విచారించారు. సూర్యాపేట మండలం తాళ్లఖమ్మంపహాడ్‌లో నివాసముంటున్న నిడిగంటి హరికృష్ణ అనే వ్యకిగా గుర్తించారు. అతడి వద్ద ఉన్న బైక్‌లోనుంచి కిలోన్నర గంజాయిని సీజ్ చేసి హరికృష్ణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. విచారణలో నిందితుడు పలు విషయాలు వెల్లడించినట్టు పేర్కొన్నారు. సూర్యాపేట పట్టణానికి చెందిన పాలబిందెల సిద్దు, అనోజ్, హరికృష్ణ స్నేహితులు. వీరికి హైదరాబాద్‌కు చెందిన శివ, ఆనంద్ స్నేహితులు. వీరంతా కలిసి అప్పుడప్పుడు బైక్‌లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం దగ్గర గల సీలేరు ప్రాంతానికి వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, కొంత గంజాయి తాగి, మరికొంత అమ్మేవారు. ఈ నెల 4న వీరంతా కలిసి 10 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. హరికృష్ణ వద్ద కిలోన్నర గంజాయి దొరికిందని, మిగతా గంజాయిని, నిందితులను కూడా పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ ఏడుకొండలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment