ఘనంగా సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన దినోత్సవం
నాగార్జునసాగర్: ఆధునిక దేవాలయం అనే పేరు సార్థకం చేసుకున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టులో విధులు నిర్వహించడం ఆనందంగా ఉందని డ్యామ్ ఎస్‌ఈ శ్రీధర్‌రావు అన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పునాది రాయి వేసి 69 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం 70వ శంకుస్థాపన దినోత్సవాన్ని ప్రాజెక్టు ఇంజనీర్లు ఘనంగా నిర్వహించారు. ఆనాటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన పైలాన్ ఫిల్లర్‌ను రంగురంగుల పూలతో అలంకరించి పూజలు చేశారు. సాగర్ డ్యామ్ నిర్మాణ సమయంలో చీఫ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహించిన మీర్‌జాఫర్ అలీ విగ్రహానికి, సాగర్ డ్యామ్ నిర్మాణ సమయంలో ప్రమాదవశాత్తు అమరులైన కార్మికుల స్మారకార్థం నిర్మించిన స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డ్యామ్ ఎస్‌ఈ శ్రీధర్‌రావు మాట్లాడుతూ ఈ ఏడాది జలాశయం పూర్తిస్థాయిలో నిండి నేటికీ గరిష్ట స్థాయిలో నీరు ఉండడం సంతోషదాయకమన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదలకు ఆరుమార్లు డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు 940 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్, ఏఈలు నర్సింహమూర్తి, కృష్ణయ్య, సత్యనారాయణ, ఎస్‌పీఎఫ్ ఆర్‌ఐ జి.శ్రీనివాస్, ఎస్‌ఐ రఘుబాబు, ప్రాజెక్టు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment