ఎస్సీ వర్గీకరణపై నేడు ఏకసభ్య కమిషన్ విచారణ
నల్లగొండ: ఎస్సీ వర్గీకరణ అంశంపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ బుధవారం నల్లగొండకు రానున్నారని జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి కోటేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ కలెక్టరేట్‌లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే బహిరంగ విచారణకు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని ఎస్సీ కుల సంఘాల నాయకులు హాజరై వినతులు సమర్పించాలని కోరారు.
విధి నిర్వహణలో
నిర్లక్ష్యం వద్దు
మర్రిగూడ: ప్రభత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మర్రిగూడ మండలం తిరగండ్లపల్లిలోని ఆరోగ్యమందిర్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి మాట్లాడారు. రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలన్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు అందుతున్న సదుపాయాలు, ఆహారాన్ని పరిశీలించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నాణ్యతతో కూడిన పోషకాహారం అందించాలన్నారు. కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కేస రవి, మర్రిగూడ పీహెచ్‌సీ ఇన్‌చార్జి డాక్టర్ షాలిని, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.
యాదగిరి క్షేత్రంలో
విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక.. ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా కొనసాగించారు. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించారు. సాయంత్రం వెండి జోడు సేవ పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీ ప్రహ్లాద యోగానంద శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్ స్వామికి పంచామృతాభిషేకం, ప్రత్యేకార్చనలు చేశారు. అనంతరం పట్టు వస్త్రాలతో స్వామిఅమ్మవార్లను అందంగా అలంకరించి ఎదుర్కొళ్లమహోత్సవం చేపట్టారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, రక్షాబంధనం, పంచగవ్యప్రాశన, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయస్వామికి తమలపాకులతో ప్రత్యేక అర్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment