గ్రూప్–2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయండి
నల్లగొండ: గ్రూప్–2 పరీక్షలు ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. గ్రూప్–2 పరీక్షల నిర్వహణపై మంగళవారం నల్లగొండ కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గ్రూప్–2 పరీక్షలకు నల్లగొండలో 59, మిర్యాలగూడలో 28 కలిపి 87 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నల్లగొండలో 21,777 మంది, మిర్యాలగూడలో 7,941 మందితో కలిపి మొత్తం 29,118 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. పరీక్షలు సజావుగా కొనసాగేందుకు ముగ్గురు రీజనల్ కోఆర్డినేటర్లు, 99 మంది డిపార్టుమెంట్ అధికారులు, 31 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 17 మంది జాయింట్ రూట్ ఆఫీసర్లు, 244 మంది ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు నిర్వహిస్తున్న అన్ని ప్రభుత్వ సంస్థలకు ఈ నెల 15, 16న స్థానిక సెలవు ప్రకటించినట్లు తెలిపారు. పరీక్షాకేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ విధించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పరీక్షలు నిర్వహించే ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలన్నారు. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లుగా కొనసాగుతాయన్నారు. అభ్యర్థులు ఒకరోజు ముందుగా పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లను ఈ నెల 9వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవటానికి వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఆర్‌ఓ అమరేందర్ పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment