సమగ్ర కుటుంబ సర్వే వేగవంతం చేయాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట: మున్సిపాలిటీలలో సమగ్ర కుటుంబ సర్వే మందకొడిగా సాగుతోందని, వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో శనివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ గ్రూప్– 3 పరీక్షల నిర్వహణ, వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లు, సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేపై జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. గ్రూప్ –3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే జిల్లాలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటిదాకా ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారని సివిల్ సప్లై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలలో అవసరమైనన్ని టార్పాలిన్లు, డిజిటల్ మైక్రో మీటర్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పత్తి కొనుగోళ్ల విషయంలో చర్చించారు. సామాజిక సర్వే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. సర్వే సమగ్ర వివరాల డాటా ఎంట్రీకి ఎంతమంది ఆపరేటర్లు అవసరమో గుర్తించి సోమవారం నుంచి డాటా ఎంట్రీ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. డాటా ఎంట్రీ కోసం మీసేవ ఆపరేటర్లను వినియోగించుకోవాలన్నారు. అవసరమైనన్ని కంప్యూటర్లు ఉన్నాయా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. సర్వే పూర్తి వివరాలపై డీపీఓ నివేదికను కోరారు. సర్వే పూర్తిచేసిన ఫారాల భద్రత స్టోరేజ్ పై ఎంపీడీవో, కమిషనర్లదే అని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలం, ఆర్డీవో రామచందర్, జిల్లా అధికారులు,మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment