● జిల్లాలో విరివిగా యాంటిబయాటిక్స్ వాడకం ● ప్రిస్క్రిప
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో అందరూ డాక్టర్ అయిపోతున్నారు. సొంతంగా మందులు వాడేవారు రోజురోజుకు పెరిగిపోతున్నారు. చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లలేక.. అలాగని ప్రైవేటు వైద్యుల వద్దకు వెళితే ఖర్చు అధికం అవుతుందని నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి మందులు తెచ్చుకుని వేసుకుంటున్నారు. వైద్యుల సలహాలు, సూచనలు లేకుండా సొంతంగా మందులు వినియోగం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు.
సొంత వైద్యం...
ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందో లేదో అన్న అనుమానం.. ప్రైవేటుగా వెళ్తే భరించలేని ఫీజులు, అనవసర పరీక్షలు.. దీంతో చాలా మంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ముందు మెడికల్ షాపులకే వెళ్తున్నారు. అనారోగ్య లక్షణాలు చెప్పగానే మెడికల్ షాపుల నిర్వాహకులు మందులు ఇచ్చి పంపుతున్నారు. అయితే కొన్నిసార్లు మందులు పడక వికటిస్తున్నాయి. ఓవర్ డోస్‌తో అస్వస్థతకు గురవుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మోతాదుకు మించి మందుల వాడక, ఇష్టానుసారంగా యాంటిబయాటిక్స్ వాడకంలో కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు కేంద్రం ఏఎంఆర్(యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్) అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తోంది.
డబ్ల్యూహెచ్‌వో ఆంక్షలు...
ప్రపంచ ఆరోగ్య సంస్థ యాంటిబయాటిక్స్ వినియోగంపై ఆంక్షలు విధించింది. తక్కువగా వినియోగించాలని, అత్యవసరమైతే నిర్ణీత మోతాదులో వాడాలని సూచనలు చేసింది. ఇన్ఫెక్షన్ బారిన పడిన కొందరు వైద్యులు సూచించిన మందులతోపాటు యాంటిబయాటిక్స్ కొనుగోలు చేస్తారు. వైద్యులు మాత్రం ఆ రోగికి ఏ మేరకు అవసరమో అంతే రాసిస్తారు. ఆ కోర్సును బాధితులు పూర్తి చేయాల్సి ఉంటుంది. కొందరికి రెండు మూడు రోజుల్లో తగ్గిపోతే వాడటం మానేస్తుంటారు. కొందరు వైద్యులు రాసిన చీటీపై మళ్లీ తీసుకెళ్లి కొనుగోలు చేసి మోతాదుకు మించి వాడేస్తున్నారు. ఇలా చేయడంతో శరీరంలోని బ్యాక్టీరియా, వైరస్ ఆ మందులకు లొంగకపోగా, రూపాంతరం చెందుతుంది. మళ్లీ అదే ఇన్ఫెక్షన్ బారిన పడితే ఆ మందులు పని చేయవు. అప్పుడు ప్రాణాంతకంగా మారే అవకాశముంది.
వైద్యుల సలహా మేరకే..
అనవసరంగా అధిక మోతాదులో యాంటీబయాటిక్ వాడకూడదు. క్వాలిఫైడ్ డాక్టర్స్ సూచన మేరకే మందులు వాడాలి. అధిక మోతాదులో వాడడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. జిల్లాలో ఆయా సీహెచ్‌సీల పరిధిలో ఈనెల 24 వరకు అవగాహన కార్యక్రమాలు
నిర్వహిస్తున్నాం.
– డాక్టర్ రాజేందర్, డీఎంహెచ్‌వో
అవగాహన కార్యక్రమాలు..
భవిష్యత్ తరాలను యాంటిబయాటిక్స్ నుంచి రక్షించే ఉద్దేశంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వాటి వాడకంపై నవంబర్ 18 నుంచి 24 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వారం రోజులపాటు రోజుకో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 18న వైద్యులు, వైద్య సిబ్బందితో యాంటిబయాటిక్స్ తక్కువగా సరైన విధానంలో వాడటం గురించి అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. బుధవారం పీహెచ్‌సీల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు, 21న పోస్టర్ల ద్వారా అవగాహన కార్యక్రమాలు, 22న రైతులు, పశువుల కాపర్లు, కార్మికులకు అవగాహన కార్యక్రమాలు, 23న విద్యార్థులకు వ్యాసరచన పోటీలను, 24న ర్యాలీలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment