హైరిస్క్ గర్భిణులపై దృష్టి పెట్టాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో గర్భస్థ శిశు మరణాలపై వైద్యశాఖ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థ మహిళల మరణాలను నివారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే గర్భిణుల మరణాలు నియంత్రించేందుకు హై పవర్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఏఎన్‌ఎం, ఆశ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు హైరిస్కు గర్భిణుల గుర్తింపు, గర్భస్థ మరణాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై వారానికి కొందరు వైద్యులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హైరిస్క్ గర్భిణులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లాలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ హెల్ప్ లైన్ కేంద్రాల ద్వారా నలుగురు ఏఎన్‌ఎం, సిబ్బంది గుర్తించిన హైరిస్క్ గర్భిణులకు ఫోన్లు చేసి, వారి ఆరోగ్యస్థితి తెలుసుకుని, వారికి అవసరమగు వైద్య సేవల వివరాలు తెలియజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే హైరిస్క్ గర్భిణులకు సంబంధించిన వివరాలు, వారి స్థితిగతుల సమాచారాన్ని తెలుసుకోవడానికి నెలవారీగా సమీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గర్భిణుల్లో హృదయ సంబంధ సమస్యలు గుర్తిస్తే ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో టూడీ ఎకో వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి సంబంధిత చికిత్స అందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్‌వో రాజేందర్, వైద్యులు సురేశ్, శ్రీనివాస్, సౌమ్య, అధికారులు పాల్గొన్నారు.
వంద శాతం ఆస్తి పన్నులు వసూలు చేయాలి
పట్టణ ప్రాంతాల్లో వంద శాతం పన్నులు వసూలు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ శాఖ పరిధిలోని పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత సమయానికి పన్నులు చెల్లించని వారికి నోటీసులు జారీ చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిశీలించి పూర్తి చేయాలన్నారు. అన్ని రకాల వ్యాపారాలకు సంబంధించి వాణిజ్య లైసెన్సులు మంజూరు చేయాలని సూచించారు. ప్రతి వ్యాపారి లైసెన్సు పొందేలా అవగాహన కల్పించాలన్నారు. పట్టణ పరిధిలోని ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా రక్షించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లు సమాచారం అందితే వెంటనే ఆక్రమణలు తొలగించి భూములను రక్షించాలన్నారు. మెప్మా పరిధిలోని అన్ని పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. నర్సరీలలో మొక్కలు పెంచేందుకు విత్తన టెండర్లకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో నిర్మల్, ఖానాపూర్, బైంసా మున్సిపల్ కమిషనర్లు ఖమర్ అహ్మద్, మనోహర్, రాజేశ్‌కుమార్, మెప్మా పీడీ సుభాష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment