మధురానగర్(విజయవాడసెంట్రల్): జనవరి 22వ తేదీన అయోధ్య శ్రీరామ ఆలయ ప్రాణప్రతిష్టలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని శైవ పీఠం శివస్వామి, మాత శివ చైత్యానంద పిలుపునిచ్చారు. ముత్యాలంపాడు కోదండ రామాలయంలో గురువారం అయోధ్య శ్రీరాముని పవిత్ర అక్షింతలు స్పర్శ కార్యక్రమం జరిగింది. శివస్వామి, మాత శివ చైత్యానంద ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. అయోధ్యలో శ్రీరాముల వారికి పూజలు చేసిన అక్షింతలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ అందజేసేందుకు ఇక్కడకు చేరుకున్నాయన్నారు. ఇక్కడ నుంచి అన్ని జిల్లాలకు అక్షింతలను పంపిస్తామన్నారు. వీహెచ్‌పీ కేంద్రీయ ఉపాధ్యక్షుడు గోక రాజు గంగరాజు, ఆర్‌ఎస్‌ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రచారక్ ఆదిత్య, కోనేరు దుర్గాప్రసాద్, నరసయ్య పాల్గొని మాట్లాడారు. ప్రాంత కార్యదర్శి తనికెళ్ల రవి, కోశాధ్యక్షుడు దుర్గాప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు.
శంకరయ్యకుసీపీఎం ఘన నివాళి
సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుడు, సీపీఎం వ్యవస్థాపక సభ్యుడు ఎస్.శంకరయ్య మృతికి ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఘన నివాళులర్పించింది. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన శంకరయ్య సంతాప సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడారు. అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా శంకరయ్య అందించిన సేవలు మరువలేనివన్నారు. 1940 లోనే పార్టీ సభ్యత్వం తీసుకుని విద్యార్థి దశ లోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న గొప్ప దేశ భక్తుడని కొనియాడారు. శంకరయ్య ఇంటికి వెళ్లి సత్కరించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రూ.10 లక్షలు చెక్ ఇస్తే దాన్ని కరోనాతో బాధపడుతోన్న వారి కోసం ఖర్చు చేయాలని తిరిగి ఇచ్చిన గొప్ప వ్యక్తి అని శ్రీనివాసరావు గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు జయరాం అధ్యక్షతన జరిగిన సభలో ఉమామహేశ్వరరావు, రమాదేవి, మంతెన సీతారాం, సీహెచ్ బాబూరావు మాట్లాడారు.
‘ఉపాధి’ తీరుపై అధ్యయనం
నాగాయలంక(అవనిగడ్డ): గ్రామాల్లో ఉపాధి హామీ పనుల తీరును అధ్యయనం చేసే క్రమంలో ఢిల్లీ నుంచి అయిదుగురు సభ్యులతో కూడిన నేషనల్ లెవల్ మానటరింగ్(ఎన్‌ఎల్‌ఎం) బృందం గురువారం మండలంలో పర్యటించింది. శిక్షణలో భాగంగా వచ్చిన ఈ బృందంలో శుభం చౌహాన్, శివమ్ భరద్వాజ్, సాగర్ రావత్, వంశిక, శ్రీష్టి ఉన్నారు. మండలంలోని టి.కొత్తపాలెం అమృత సరోవర్ ట్యాంక్‌ను బృందం సభ్యులు పరిశీలించి పనులు జరిగిన తీరును అడిగి తెలుసుకు న్నారు. రూ.2.62లక్షలు వ్యయంతో కూలీలకు 1150 పనిదినాలు కల్పించామని మండల ఏపీఓ రవికుమార్ వివరించారు. పర్యటనలో ఈఓ పీఆర్‌డీ కె.అప్పలనరసమ్మ, సర్పంచ్ శివపార్వతి భర్త బండ్రెడ్డి శ్రీనివాసరావు, ఉపాధిహామీ క్షేత్ర సిబ్బంది పాల్గొన్నారు.
28 నుంచి ప్లంబింగ్‌లో ఉచిత శిక్షణ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్లంబింగ్ మేస్త్రిలు, వర్కర్లతో పాటు ఆసక్తి ఉన్న యువకులకు ప్లంబింగ్ పనుల్లో నైపుణ్యాలు పెంచేందుకు ఉచిత శిక్షణ ఇస్తామని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్ జి.పవన్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి శిక్షణ మొదలవుతుందని పేర్కొన్నారు. విద్యాధరపురం కబేళా దగ్గర ఉన్న సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ ఆవరణలో శిక్షణ తరగతులు కొనసాగుతా యని వివరించారు. ఓవర్‌హెడ్ ట్యాంక్ కనెక్షన్, పంపులు, మోటార్లు అమర్చడంపై అవగాహన, వాటర్ ట్యాంక్ రిపేరు, హెచ్‌డీపీఈ, యూపీవీసీ, సీపీవీసీ పైపుల జాయింట్ రిపేర్లు, హౌస్ వాటర్ సర్వీస్ కనెక్షన్, కేబుల్ జాయింటింగ్‌పై శిక్షణ ఇస్తామని వివరించారు. కోర్సు సమయంలో భోజన సదుపాయంతో పాటుగా రూ.500 గౌరవ వేతనం ఇస్తామని పేర్కొన్నారు. కోర్సు పూర్తి చేసిన వారికి వాటర్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లంబింగ్ స్కిల్ కౌన్సిల్ న్యూఢిల్లీ నుంచి సర్టిఫికెట్ కూడా అందిస్తామని తెలిపారు. 18 నుంచి 50 ఏళ్లలోపు వారు అర్హులని, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 24 లోగా 96667 71746, 98667 95010 సెల్ నంబర్లలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment