గుణదల (విజయవాడ తూర్పు): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ పేదల ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుందని, పేదల నాడి తెలిసిన నాయకుడిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని 5వ డివిజన్ సున్నపు బట్టీల సెంటర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షంగా పోరాడుతోందన్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పేదలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలే పార్టీని తిరిగి అధికారంలోకి తెస్తాయని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని కొండ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో కొండ ప్రాంతాలలో సుమారు 42 పనులను చేపట్టన్నామన్నారు.
‘తూర్పు’ అభివృద్ధికి సీఎం జగన్ కృషి..
విజయవాడ తూర్పు నియోజకవర్గం గత దశాబ్ద కాలంగా అభివృద్ధికి దూరమైందన్నారు. టీడీపీ నాయకులు ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితమయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, కార్పొరేటర్లు కలపాల అంబేడ్కర్, అంబడిపూడి నిర్మలా కుమారి, భీమిశెట్టి ప్రవళ్లిక, తదితరులు పాల్గొన్నారు.
హోం మంత్రి తానేటి వనిత విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రూ. 5కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Comments
Please login to add a commentAdd a comment