అధికారులు కావలెను!
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో పాలన అంతా ఇన్చార్జిలపైనే నడుస్తోంది. కీలక శాఖలకు అధికారులు లేక పాలన కుంటుపడుతోంది. ఆయా శాఖలపై పర్యవేక్షణ కొరవడుతోంది. ఎక్కడి ఫైళ్లు అక్కడే పెండింగ్ పడుతున్నాయి. జిల్లా కలెక్టర్ నుంచి ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారుల్లో అధిక భాగం ఇన్చార్జిలే పాలన సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జిల్లా పరిధిలో 22 శాఖలకు అధికారులను నియమించలేదు. ఫలితంగా వేరే శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులే ఖాళీగా ఉన్న శాఖల అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇన్చార్జిలుగా, అదనపు బాధ్యతలు చేపట్టిన వారంతా తమ శాఖలకు సంబంధించిన పనుల్లో తలమునకలై ఉంటున్నారు. ఇక అదనపు బాధ్యతలు తీసుకున్న శాఖలపై దృష్టి సారించలేకపోతున్నారు.
గతంలో పూర్తి స్థాయిలో..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల పునర్విభజన చేపట్టింది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఆవిర్భవించింది. దాదాపు అన్ని శాఖలకు అధికారులను నియమించింది. 2022 ఏప్రిల్ 2న నూతన జిల్లా ఏర్పాటైన నాటి నుంచి ఆ ప్రభుత్వం దిగిపోయే వరకు దాదాపు అన్ని శాఖలకు పూర్తిస్థాయిలో అధికారులు ఉన్నారు.
కలెక్టర్ నుంచి మొదలు..
ఈ ఏడాది జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వ ప్రాధాన్యతలకు తగ్గట్టు అధికారుల బదిలీలు చేపట్టింది. తొలుత జిల్లా కలెక్టర్ ఢిల్లీరావును బదిలీ చేసి సృజనను కలెక్టర్గా నియమించింది. స్థానికత అంశంలో ట్రైబ్యూనల్ తీర్పు మేరకు అక్టోబర్ 16న ఆమె తెలంగాణకు వెళ్లిపోయారు. ఆ వెంటనే జాయింట్ కలెక్టర్గా ఉన్న డాక్టర్ నిధి మీనాకు తొలుత ఇన్చార్జిగా, ఆ తర్వాత రెండు, మూడు రోజులకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. నవంబర్ 3న జిల్లా కలెక్టర్గా లక్ష్మీశాను ప్రభుత్వం నియమించింది. ఆయన మహారాష్ట్ర ఎన్నికల విధుల్లో ఉండడంతో ఇప్పటి వరకు బాధ్యతలు చేపట్టలేదు. దీంతో ప్రస్తుతం నిధి మీనా పూర్తి అదనపు బాధ్యతలతో కలెక్టర్గా కొనసాగుతున్నారు.
ఖాళీగా కూర్చోబెట్టి..
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కీలక శాఖలు, స్థానాల్లో తమకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను, ప్రజా ప్రతినిధుల సిఫార్సులతో నియమించింది. ఈ నేపథ్యంలో కొందరిని పక్కనబెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చాక 30 మంది డెప్యూటీ కలెక్టర్లను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. వీరంతా తమకు శాఖలు కేటాయించకపోవడంతో సచివాలయంలో ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని శాఖలకు తమకు అనుకూలంగా అధికారులు దొరకకనో, మరే ఇతర కారణాల వల్లో ప్రభుత్వం కీలక శాఖలకు అధికారులను నియమించలేదు. ప్రస్తుతం ఉన్న అధికారులనే ఆయా శాఖలకు ఇన్చార్జిలు, పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం వీరంతా తమ శాఖతో పాటు అదనపు బాధ్యతలు కూడా తోడవడంతో రెంటికి న్యాయం చేయలేక తలలు పట్టుకుంటున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో కీలక శాఖలకు అధికారులు కరువు 22 శాఖలను ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్న వైనం పర్యవేక్షణ లోపించి, కుంటుపడుతున్న పాలన
కీలక శాఖల్లోనూ..
జిల్లాలో అత్యంత కీలకమైన శాఖలకు ఇన్చార్జిలే దిక్కయ్యారు. రెవెన్యూ శాఖలో కేకేఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ పోస్టు ఖాళీ ఉంది. డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేటిక్స్లో పోస్టు ఖాళీగానే ఉంది.
వీఎంసీ అదనపు మున్సిపల్ కమిషనర్(జనరల్) పోస్టు ఖాళీగానే ఉంది. వీటికి ఇన్ చార్జిలను కూడా నియమించలేదు.
కీలకమైన వ్యవసాయం, గ్రామ, వార్డు సచివాలయాలు, హౌసింగ్, గ్రామీణ నీటి పారుదల, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించి అధికారులను నియమించలేదు. వీటిలో సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, బీసీ కార్పొరేషన్ ఈడీలుగా డీఆర్డీఏ పీడీకి, ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించి డ్వామా పీడీకీ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
వ్యవసాయం, జిల్లా ట్రెజరరీ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, ఇంటర్ విద్య వంటి వాటికి ఇన్చార్జిలను నియమించారు.
హ్యాండ్లూమ్, ఫిషరీస్, జిల్లా మలేరియా ఆఫీసర్, ఏపీకేవీఐబీ, సెరీకల్చర్ శాఖలకు అఽధికారుల నియామకం చేపట్టకపోవడంతో ఇన్చార్జిలే కొనసాగుతున్నారు.
గిరిజన సంక్షేమ శాఖ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ అధ్యాపకులు గత పది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ శాఖకు పూర్తి స్థాయిలో అధికారం లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
పీజీఆర్ఎస్లోనూ ఆయా శాఖలకు సంబంధించిన అర్జీలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment