రిట్ పిటిషన్‌తో నోట్లో మట్టి
దుర్గా కో ఆపరేటివ్ బ్యాంక్‌లో డిపాజిటర్ల ఆవేదన
భవానీపురం(విజయవాడపశ్చిమ): డబ్బు ఉండీ లేనివారిలా.. అవసరాలను తీర్చుకోలేక మానసిక క్షోభ అనుభవిస్తున్న దుర్గా కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుల వెతలు అన్నీ, ఇన్నీ కావు. ఈ క్రమంలో బాధిత డిపాజిటర్ల సమావేశం విద్యాధరపురం చెరువు సెంటర్‌లోని మర్రి చెట్టు వద్ద శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ది దుర్గా కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పీఎస్ చరణ్ మాట్లాడుతూ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన ఆర్‌బీఐ రూ.5లక్షల వరకు డిపాజిట్ సొమ్మును ఖాతారులకు ఇచ్చివేయాలని ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే బ్యాంక్ సీఈఓ బంకా శ్రీనివాసరావు కోర్టులో రిట్ పిటిషన్ (నెంబర్:26357) వేయటంతో కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని చెప్పారు. దీంతో రూ.5 లక్షల డిపాజిట్ల చెల్లింపులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. వాస్తవానికి బ్యాంక్ చైర్మన్ అనుమతి లేకుండా సీఈఓ పిటిషన్ వేయటానికి వీలు లేదని చెప్పారు. కోర్టు ఈ నెల 18న స్టే ఇస్తే, ఆర్‌బీఐ నియమించిన లిక్విడేటర్ అదే రోజు వచ్చి 16న వచ్చినట్లు సంతకం ఎలా చేశారని ప్రశ్నించారు. పాలకవర్గంతో లిక్విడేటర్ కుమ్మక్కయ్యారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. బ్యాంక్‌లో డిపాజిట్లు ఉన్నాయని పాలకవర్గం చెబుతున్నప్పటికీ అసలు ఉన్నాయా లేదా అన్న అనుమానాలు డిపాజిటర్లలో తలెత్తుతున్నాయని అన్నారు. ఆర్‌బీఐ జోక్యం చేసుకుని తక్షణమే చెల్లింపులు చేసి ఆదుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment