కుంభకోణాల అదానీని అరెస్టు చేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్రంలోని బీజేపీ, మోదీ అండతో అదానీ దేశాన్ని కొల్లగొట్టారని, కుంభకోణాల అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లను తక్షణమే ఆపాలని, అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకోవాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడ బీసెంట్ రోడ్డులో శుక్రవారం ఆందోళన చేపట్టారు. అదానీ చిత్రపటాన్ని కటకటాలలో ఉంచి సంకెళ్లను వేసి అరెస్ట్ చేస్తున్నట్లుగా వినూత్న రీతిలో ప్రదర్శన చేశారు. ప్ల కార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాబూరావు, డి.కాశీనాథ్ మాట్లాడుతూ అదానీ అవినీతి మరోసారి బట్టబయలైందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కుంభకోణాలు రుజువు కావడంతో అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయన్నారు. ఈ క్రమంలో అదానీ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టును కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వం శరవేగంగా స్మార్ట్ మీటర్లను బిగించడం సిగ్గుచేటన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బోయి సత్యబాబు, కోట కల్యాణ్, జిల్లా కమిటీ సభ్యుడు బి. రమణరావు, కె.దుర్గారావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment