హ్యాండ్‌బాల్ జాతీయ పోటీలకు జెడ్పీ విద్యార్థులు
విజయవాడస్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌జీఎఫ్‌ఐ) 68వ హ్యాండ్ బాల్ అండర్–14 జాతీయ పోటీలకు పటమట కేబీసీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అర్హత సాధించారు. గత నెల 26 నుంచి 28వ తేదీ వరకు తెనాలిలో జరిగిన రాష్ట్ర స్థాయి బాలుర పోటీల్లో పి.సంతోష్ (తొమ్మిదో తరగతి), ఆర్.ఏసు(ఏడో తరగతి), బాలికల పోటీల్లో పి.సఫియా(ఎనిమిదో తర గతి), బి.జాహ్నవి(ఎనిమిదో తరగతి) సత్తా చాటి రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు చత్తీస్ గఢ్‌లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొన నున్నారు. పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో విజేతలను స్కూల్ హెచ్‌ఎం జి.ఎస్తేరురాణి, వ్యాయామ విద్యా సహాయకుడు, కోచ్ ఎల్. దుర్గారావు, పీఈటీ ఎస్.రమేష్ అభినందించారు.
సరుకు రవాణాలో రైల్వే ట్రాన్స్‌పోర్టు ఉత్తమం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): సరుకులను సురక్షితంగా, వేగవంతంగా గమ్యస్థానాలకు చేర్చడంలో రైల్వే ట్రాన్స్‌పోర్టు ఉత్తమం అని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ అన్నారు. డీఆర్‌ఎం కార్యాలయంలో రైల్వే ఫ్రైట్ కస్టమర్స్‌తో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. సరుకు లోడింగ్ అంచనాలు, ఆదాయం, రేక్‌ల సరఫరా తదితర విషయాలపై వారితో సమీక్షించారు. సకాలంలో లోడింగ్ పూర్తిచేసేలా, వ్యాగన్ డ్యామేజ్ చార్జీలను నివారించేలా లోడింగ్ పక్రియ పూర్తిచేయాల్సిందిగా నిర్వాహకులకు సూచించారు. గూడ్స్ షెడ్లలో సౌకర్యాల పునరుద్ధరణకు పూర్తి సహకారం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం కొండా శ్రీనివాసరావు, సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, సీనియర్ డీఓఎం డి.నర్రేంద్ర వర్మ, సీనియర్ డీఎంఈ సంజయ్, సీనియర్ డీఎఫ్‌ఎం సందీప్, డీసీఎం ఎండీ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.
క్రెడాయ్ ప్రాపర్టీ షో బ్రోచర్ ఆవిష్కరణ
రామవరప్పాడు: క్రెడాయ్ విజయవాడ 10వ ప్రాపర్టీ షో బ్రోచర్‌ను శుక్రవారం హోటల్ హయత్‌లో ఎస్‌బీఐ డీజీఎం మనీష్‌కుమార్ సింగ్ ఆవిష్కరించారు. క్రెడాయ్ అధ్యక్షుడు డి.రాంబాబు మాట్లాడుతూ వచ్చే జనవరి 10, 11, 12 తేదీల్లో నగరంలోని ఎ.కన్వెన్షన్‌లో ప్రాపర్టీ షో నిర్వహించనున్నట్లు తెలిపారు. కొత్త ప్రాజెక్టులతో పాటు స్టీల్, సిమెంట్, శానిటరీ వేర్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఫ్లోరింగ్, సొల్యూషన్స్, ఇంటీరియర్ డెకరేటర్‌లు, హౌసింగ్‌కు సంబంధించిన ఇతర అనుబంధ పరిశ్రమల నుంచి కొత్త ఉత్పత్తి లైనప్‌లను ప్రదర్శించనున్నట్లు వివరించారు. రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, బ్యాంకింగ్ హోమ్ లోన్‌లు అన్నింటినీ ఒకే వేదిక పైకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వరదా శ్రీధర్, కోశాధికారి టి.వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా సవరణపై నేడు, రేపు ప్రత్యేక క్యాంపులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2025లో భాగంగా శని, ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ నిధి మీనా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక క్యాంపులలో భాగంగా ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్వోలు పోలింగ్ స్టేషన్‌లలో అందుబాటులో ఉంటారన్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయడం, ముసాయిదాలో అభ్యంతరాలను సరిచేయడం, చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం, ఓటరు కార్డులలో తప్పులు సరిచేయడం వంటివి బీఎల్వోలు చేస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment