వరిపంట దగ్ధం
బలిజిపేట: మండలంలోని కూర్మనాథపురం రెవెన్యూ పరిధిలో గల 52సెంట్ల భూమిలో వరిపంట ప్రమాదవశాత్తు మంగళవారం దగ్ధమైంది. గ్రామానికి చెందిన బి.లక్ష్మణరావు భూమిలో సుమారు రూ.30వేల విలువైన పంటకు నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ నష్టాన్ని పరిశీలించి నివేదిక తయారుచేసి అధికారులకు అందించనున్నట్లు వీఆర్‌ఓ స్వామినాయుడు చెప్పారు. కార్యక్రమంలో పలువరు రైతులు పాల్గొన్నారు.
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
రాజాం సిటీ: మండల పరిధి సోపేరు గ్రామానికి చెందిన కోటగిరి మధు (48) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై ఎస్సై నర్సింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం మధు కొన్నేళ్లుగా కాళ్లూచేతులు పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని స్థితిలో తీవ్రమనస్తాపానికి గురై జీవితంపై విరక్తి చెందాడు. ఈ నేపథ్యంలో వ్యవసాయం నిమిత్తం ఇంట్లో ఉంచిన పురుగుమందును ఈ నెల 18న తాగేశాడు. విషయం గమనించిన కుటుంబసభ్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తరువాత మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుని సోదరుడు అశోక్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
రూ.50వేల నగదు చోరీ
గుర్ల: మండలంలోని పాలవలస గ్రామంలో మంగళవారం దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన తాడ్డి గౌరినాయుడు ఇంట్లో దొంగలు పడి బీరువాను పగలగొట్టారు. బీరువాలో బంగారు అభరణాలు ఉన్నప్పటికీ సుమారు రూ.50 వేల నగదు అపహరించినట్లు గౌరినాయుడు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ దొంగతనంపై బాధితులు గుర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై పి.నారాయణ రావు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. విచారణ చేసి నిందితులను పట్టుకుంటామని ఎస్సై తెలిపారు.
గంజాయి కేసులో
మరో నిందితుడి అరెస్ట్
విజయనగరం క్రైమ్: గంజాయి కేసులో మరో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్వారపూడి గ్రామశివారులో ఇటీవల ముగ్గురు వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా ఈనెల 12న వారిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో నిందితుడు భువనేశ్వర్‌కు చెందిన రాజేష్ బాగ్‌ను విజయనగరం రైల్వేస్టేషన్ వద్ద సోమవారం రూరల్ సీఐ బి.లక్ష్మణరావు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నిందితుడి దగ్గర నుంచి రెండు కిలోల గంజాయిని, రూ.210 నగదు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలియజేశారు. కేసులో క్రియాశీలకంగా పనిచేసిన సీఐ లక్ష్మణరావు, ఎస్సై వి.అశోక్ కుమార్‌లను డీఎస్పీ అభినందించారు.
ఆధార్ అనుసంధానం తప్పనిసరి
విజయనగరం అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 60 శాతం పోస్టు మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌లను బ్యాంకు ఖాతాల్లో జమచేసేందుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి రామానందం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమీప గ్రామ/వార్డు సచివాలయాల వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్/వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, పోస్టాఫీస్ వారిని సంప్రదించి ఎన్‌పీసీఐ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోతే డబ్బులు జమకావన్నారు.
చెరకు టన్ను రూ.3151
● మద్దతుధర ప్రకటించిన సంకిలి
ఈఐడీ చక్కెర కర్మాగారం
● ఈనెల 20 నుంచి క్రషింగ్ ప్రారంభం
రేగిడి: మండలంలోని సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం యాజమాన్యం చెరకు రైతులకు తీపికబురు చెప్పింది. ఈ నెల 20 నుంచి చెరకు క్రషింగ్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. కర్మాగారం వద్ద మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ అసోసియేటివ్ వైస్ ప్రెసిడెంట్ వి.పట్టాభిరామిరెడ్డి మాట్లాడారు. ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం 2024–25 క్రషింగ్ సీజన్‌కు సంబంధించి టన్ను చెరకకు రూ.3,151లు మద్దతు ధర చెల్లిస్తామని వెల్లడించారు. గత ఏడాది కంటే టన్నుకు రూ.71లు పెంచినట్టు పేర్కొన్నారు. క్రషింగ్ సీజన్ అనంతరం రైతులకు ప్రోత్సహకాలు అందజేస్తామని చెప్పారు. సమావేశంలో కేన్ డీజీఎం ఆర్.రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment