శాశ్వత పోస్టులు మంజూరు చేయండి
మంత్రికి ఏఐటీయూసీ నాయకుల వినతి
నరసరావుపేట: నాగార్జున సాగర్ ప్రాజెక్టు, కాలువలకు శాశ్వత పోస్టులు మంజూరు చేయాలని పీడబ్ల్యూడీ వర్క్‌షాపు అండ్ కెనాల్స్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయుసీ) నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు కార్యాలయంలో మంత్రి ప్రతినిధి శ్రీనివాసరావుకు అధ్యక్షులు టి.శేషయ్య, ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి రంగయ్య వినతిపత్రం సమర్పించారు. సాగర్ ప్రాజెక్టు క్రింద కుడి కాలువల పొడవు 202 కి.మీ, బ్రాంచి, మేజర్, మైనర్లు మొత్తం షుమారుగా 8064 చ.కి.మీ. విస్తీర్ణం పొడవున పల్నాడు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో విస్తరించి ఉన్నాయన్నారు. స్థిరీకరణ ఆయకట్టు 11,74,874 లక్షల ఎకరాలు ఉండగా, అనుమతి లేని, ప్రభుత్వ లెక్కలలో లేని భూమి ఒక లక్ష ఎకరాలు పైబడి మాగాణి, మెట్ట పంటలకు సాగునీరు, కొన్ని వందల చెరువులకు త్రాగునీరు, కొన్ని వేల పశువుల కుంటలకు తాగునీరు అందిస్తూ ఏటా 25 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతుందన్నారు. కాలువల డిజైన్ సమయంలో మెట్ట భూము లుగా స్థిరీకరణ చేసిన 6.81 లక్షల ఎకరాల ఆయకట్టులో సుమారు 3.5 లక్షల ఎకరాలు మాగాణి భూములుగా మారిపోయాయని పేర్కొన్నారు. ప్రతిఏడాది 292.5 మిలియన్ల యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు శాశ్వత ప్రయోజనాల నిమిత్తం అనేక క్షేత్రస్థాయి నిర్వహణ సిబ్బంది. ఉద్యోగులు, శాశ్వత ప్రాతిపదికన అవసరమైందన్నారు. కాని తగిన క్షేత్రస్థాయి సిబ్బంది లేనందున రైతులకు సాగునీరు అందించే సమయంలో వివిధ విభాగాల ఉద్యోగులను ఉపయోగించు కొనే పరిస్థితి నెలకొందన్నారు. 2018 నుంచి పెండింగ్‌లో వున్న అన్నిరకాల బకాయిలను చెల్లింపు చేయాలని, లస్కర్లు, వర్క్ ఇనస్పెక్టర్లు, ఇతర సిబ్బందికి ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని కోరారు. వీటితో పాటు ఇంకా అనేక డిమాండ్లను వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment