వేర్వేరు కేసుల్లో పది మంది దొంగల అరెస్టు
నరసరావుపేట: జిల్లాలో పలుస్టేషన్లలో నమోదైన వేర్వేరు చోరీ కేసుల్లో ఒక అంతర్ జిల్లా దొంగతోపాటు తొమ్మిది మంది చోరులను అరెస్టుచేసి వారి వద్ద నుంచి సుమారు రూ.40 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నేరస్తుల నుంచి స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తును ప్రదర్శించి దొంగతనాల వివరాలను వెల్లడించారు.
● పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాలతోపాటు చిలకలూరిపేట పరిధిలో దొంగతనాలకు పాల్పడుతూ ఐదు కేసుల్లో నిందితుడైన అంతరజిల్లా దొంగ నరసరావుపేట ఇస్లాంపేటకు చెందిన షేక్ సుభానిని అరెస్టుచేసి 170 గ్రాముల బంగారం, నాలుగు కేజీల వెండి, రూ.10వేలు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వివరించారు.
● ఐనవోలు పరిధిలో చోరీలు చేస్తున్న ఐనవోలుకు చెందిన లింగా యలమంద, కొమ్మిరిశెట్టి రామాంజనేయులను అరెస్టుచేసి 8 మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.
● ఈపూరు మండలం కొండ్రముట్ల సచివాలయం, ఆయుష్మాన్‌భవ భవనం, రైతు భరోసా కేంద్రం, కొచ్చర్ల హైస్కూలులో జరిగిన చోరీ కేసుల్లో రేమిడిచర్లకు చెందిన జరపాల వెంకటేశ్వర్లునాయక్, నరసరావుపేట పల్నాడు బస్టాండ్ ప్రాంతంలో ఉంటున్న శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం, ముప్పిడి వాసి భూక్య బాలాజీ నాయక్‌తోపాటు పూడివలస గణపతి అలియాస్ గణేష్‌ను అరెస్టుచేసి, వారి వద్ద నుంచి రూ.4 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ చెప్పారు.
● వెల్దుర్తి పరిధిలో దొంగతనాలు చేస్తున్న మాచర్లకు చెందిన మట్టపల్లి హరిబాబు అలియాస్ కమ్మ కాశి, చల్లా భవానిశంకర్ అలియాస్ శంకర్, షేక్ మస్తాన్ వలి అలియాస్ అత్తిలిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ కేసుల దర్యాప్తును పర్యవేక్షించిన నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు, గురజాల డీఎస్పీలతోపాటు సమగ్ర దర్యాప్తు చేసిన చిలకలూరిపేట టౌన్ పోలీస్ సీఐ రమేష్, ఐనవోలు, ఈపూరు, వెల్దుర్తి ఎస్‌ఐలు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వీరందరికీ రివార్డులు అందజేయనున్నట్లు చెప్పారు.
రూ.40 లక్షల విలువైన
చోరీ సొత్తు స్వాధీనం
వెల్లడించిన ఎస్పీ శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment