సోమేపల్లి జీవితం ఆదర్శనీయం | - | Sakshi
Sakshi News home page

సోమేపల్లి జీవితం ఆదర్శనీయం

Published Mon, Dec 16 2024 1:58 AM | Last Updated on Mon, Dec 16 2024 1:58 AM

సోమేపల్లి జీవితం ఆదర్శనీయం

సోమేపల్లి జీవితం ఆదర్శనీయం

నగరంపాలెం: సోమేపల్లి వెంకట సుబ్బయ్య వృత్తి ధర్మం, కుటుంబ బాధ్యతలు, సమాజ ధర్మాలను సమపాళ్లలో నిర్వర్తించారని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ పాపినేని శివశంకర్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం, గుంటూరు జిల్లా రచయితల సంఘం, రమ్య భారతి, సోమేపల్లి లెటరరీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో లక్ష్మీపురం కాటన్‌ అసోసియేషన్‌ సమావేశ మందిరంలో ఆదివారం ‘సోమేపల్లి సాహితీ సౌరభం’ పేరుతో ఐదు సాహితీ సమావేశాలు నిర్వహించారు. తొలుత సోమేపల్లి వెంకట సుబ్బయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రచయితల సంఘం ఏర్పాటు స్ఫూర్తిదాయకం

అనంతరం జరిగిన తొలిసభకు అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రచయితల సంఘం అధ్యక్షురాలు డాక్టర్‌ చిల్లర భవానీదేవి మాట్లాడుతూ.. జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం ఏర్పాటుతో యువ రచయితలకు స్ఫూర్తిదాయకంగా కార్యక్రమాలు నిర్వహించిన గొప్ప మానవతావాది వెంకట సుబ్బయ్య అని కొనియాడారు. సోమేపల్లి వెంకట సుబ్బయ్య స్మారక సంచిక ‘హరిత సంతకం’ గ్రంథ ఆవిష్కరణ చేసిన ముఖ్య అతిథి డాక్టర్‌ శివశంకర్‌ మాట్లాడుతూ.. వెంకట సుబ్బయ్య జీవితం సమాజానికి ఆదర్శప్రాయం అన్నారు. మానుకొండ ఉపేంద్రరావు, తోటకూర వెంకట నారాయణ, షేక్‌ ఇస్మాయిల్‌లు వెంకట సుబ్బయ్యతో జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

రచయితలకు సన్మానం

రెండోదైన సోమేపల్లి సాహితీ విశ్లేషణ సభకు డాక్టర్‌ వి.నాగరాజ్యలక్ష్మి అధ్యక్షత వహించగా, డాక్టర్‌ సుంకర గోపాలయ్య వచన కవిత్వం, కె.జె.రమేష్‌ నానీలపై మాట్లాడారు. మూడో సభకు షేక్‌ హాసీంబీ అధ్యక్షత వహించగా, నాగిశెట్టి నాగేశ్వరరావు రాసిన ‘నా నానీలు’ పుస్తకాన్ని సోమేపల్లి విజయలక్ష్మి ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్‌ భవానీదేవి, రాచమళ్ల ఉపేందర్‌ సమీక్ష చేశారు. ప్రాతఃస్మరణీయులు పుస్తకావిష్కరణ అనంతరం 15వ సోమేపల్లి సాహితీ పురస్కారాల సభకు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. సాహితీవేత్త కాట్రగడ్డ దయానంద్‌ మాట్లాడారు. మొదటి బహుమతి సాధించిన ‘డొక్కు బండి’ రచయిత వెంకు సనాతనికి, ‘ఆసరా’ కథా రచయిత మయూఖ, ‘ఉచిస్టం’ రచయిత సింగరాజు శ్రీనివాసరావుకు ప్రత్యేక ప్రశంసా పురస్కారాలు, నగదు, జ్ఞాపికలు అందించారు. వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. సభలో ఆహ్వాన కమిటీ సభ్యులు ఎస్‌.ఎం.సుభాని, నానా, శ్రీవశిష్ట, విరంచి, ఉమామహేశ్వర రెడ్డి, శర్మ, జయప్రకాష్‌, పుష్పాదేవి, చంద్రశేఖర్‌, రచయితలు, కవులు, సాహితీవేత్తలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించిన వెంకట సుబ్బయ్య ‘సాహితీ సౌరభం’ సమావేశాల్లో డాక్టర్‌ పాపినేని శివశంకర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement