నసీర్ అహ్మద్‌కు జాతీయ సమైక్యత పురస్కారం
పిడుగురాళ్ల: పిడుగురాళ్లకు చెందిన రచయిత సయ్యద్ నసీర్ అహ్మద్ జాతీయ సమైక్యతా పురస్కారం అందుకున్నారు. అనంతపురం జిల్లాలోని చారిత్రక పెనుగొండ పట్టణంలో ఈ నెల 13న పెనుగొండ దర్గా పీఠాధిపతి తాజుద్దీన్ బాబా అధ్యక్షతన జరిగిన జాతీయ సమగ్రత–సమైక్యత, ఐక్యత సదస్సులో నశీర్ అహ్మద్‌కు జాతీయ సమైక్యతా పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారు మహ్మద్ షరీఫ్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నట్లు నసీర్ అహ్మద్ తెలిపారు. జంపని ఆస్థాన అధినేత నిజాముద్దీన్‌తోపాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ ఐస్ స్కేటింగ్ డే వేడుకలు
లక్ష్మీపురం: స్కేటింగ్ సాధనతో చిన్నారుల్లో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం పెరుగుతాయని ఆంధ్రప్రదేశ్ ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ సెక్రటరీలు షేక్ ఖాజా, అబ్దుల్ సలాం, నూరుద్దీన్‌లు అన్నారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఆదివారం జాతీయ ఐస్ స్కేటింగ్ డే వేడుకలను ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చినవారు గంట పాటు స్కేటింగ్ చేశారు. అనంతరం క్రీడాకారుల విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. పాల్గొన్న వారికి సర్టిఫికెట్‌లను అందజేశారు.
రాజ్యాంగం అమలుపై చర్చ మంచి పరిణామం
బాపట్ల: రాజ్యాంగం అమలుపై పార్లమెంటులో జరిగిన చర్చ ఆహ్వానించదగిన పరిణామమని అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల ప్రసాద్ అన్నారు. ఆదివారం బాపట్ల 24వ వార్డు డ్రైవర్స్ కాలనీలో ‘రాజ్యాంగం – భద్రత లేని పేదల బతుకులు’ అంశంపై జరిగిన సమావేశంలో మేకల ప్రసాద్ మాట్లాడారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా పార్లమెంట్లో జరిగిన చర్చలో ప్రధాని మోదీ ప్రసంగించిన విషయాన్ని గుర్తు చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగ కర్తలు అద్భుతంగా రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నట్లు తెలిపారు. దాన్ని నెహ్రూ, గాంధీ కుటుంబం ఇష్టం వచ్చినట్లుగా మార్చేసిందని వ్యాఖ్యానించటం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు చేస్తే, మోదీ ప్రభుత్వం కూడా అదే తరహాలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు హఫీజుల్లా, వి.రవి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment