విద్యుత్ చార్జీలపై ప్రజల్ని వంచించిన కూటమి
లక్ష్మీపురం: తాము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు తగ్గిస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు చార్జీలు పెంచి ప్రజల్ని వంచించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు విమర్శించారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయం వద్ద ఆదివారం విద్యుత్ బిల్లులను దహనం చేసి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ఆరు నెలల పాలనలోనే రూ.15,486 కోట్ల భారం ప్రజలపై వేసిందన్నారు. 25 ఏళ్లపాటు రూ.1.10 లక్షల కోట్లను ప్రజల నుంచి వసూలు చేయటానికి రంగం సిద్ధం చేశారన్నారు. అభివృధ్ధి అంటూ పేదలపైనే భారం మోపుతున్నారని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రతి ఇంటికీ రూ.10 వేలు చొప్పున 1.50 కోట్ల మంది వినియోగదారులపై మరో భారం మోపనున్నారని తెలిపారు. మోడీ ఆదేశాలతో అదానీని కాపాడే విషయంలో కూటమి పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఒప్పందం రద్దు చేసుకుంటే రూ.3 వేల కోట్లు పెనాల్టీ చెల్లించాలని అబద్ధాలు చెబుతున్నారని, నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అదే నిజమనుకున్నా రూ.3 వేల కోట్ల పెనాల్టీ కోసం ప్రజలపై రూ.1.10 లక్షల కోట్ల భారం వేస్తారా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఇక అదానీ వైపు ఉంటుందో, ప్రజల వైపు ఉంటుందో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ.. మంచి పాలన అందిస్తామని వాగ్దానం చేసిన కూటమి నాయకులు ఇప్పుడు మోసం చేస్తున్నారన్నారు. కేంద్ర సర్కారు మనుగడ టీడీపీపై ఆధారపడి ఉందని, ఇప్పటికై నా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టాలని, ప్రజల ఆకాంక్షలను ఆ పార్టీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు పాశం రామారావు, వై.నేతాజీ, కె.నళినీకాంత్, అప్పారావు, ఎం.రవి తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాబురావు కరెంట్ బిల్లులను దహనం చేసి నాయకుల నిరసన
Comments
Please login to add a commentAdd a comment