పోరాటానికి ప్రతిరూపం పొట్టి శ్రీరాములు
లక్ష్మీపురం: పోరాటానికి ప్రతిరూపం అమరజీవి పొట్టి శ్రీరాములు అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషనన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కొనియాడారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అతిథి గృహం వద్ద అమరజీవి విగ్రహానికి ఆయన ఆదివారం ఉదయం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ... దళితులను దేవాలయాల్లోనికి రానివ్వాలని మొదట పోరాటాన్ని ప్రారంభించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం, తెలుగు జాతి కోసం 56 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రంతోపాటు ఇతర భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తోడ్పడ్డారన్నారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ... ఆంధ్రులకు ఒక రాష్ట్రం కావాలని మద్రాస్ ప్రెసిడెన్సీలో శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారని తెలిపారు. రాష్ట్రం, ప్రజలు అభివృద్ధి చెందడమే పొట్టి శ్రీరాములుకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ ఎ.భార్గవ్ తేజ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు.
రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
ిపడుగురాళ్ల: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన తుమ్మలచెరువు– నడికుడి రైల్వే స్టేషన్ల మధ్యలో ఆదివారం జరిగింది. మృతుడికి సుమారు 30 నుంచి 40 సంవత్సరాలు ఉంటాయని నడికుడి రైల్వే స్టేషన్ ఎస్‌ఐ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. గుర్తుపట్టలేని విధంగా మృతదేహం ఉందని, మృతుని చేతిపైన రెబల్ అని పచ్చబొట్టు ఉన్నట్లు తెలిపారు. మృతుడు నల్లపురంగు చొక్కా, బ్లూ రంగు జీన్‌ప్యాంట్ ధరించి ఉన్నాడని, మృతుని వివరాలు తెలిసిన వారు 9440438256 నెంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment