అనాథ శరణాలయం అభివృద్ధికి కృషి
మాచవరం: వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో పేదల విద్యాభివృద్ధికై ఏర్పాటు చేసిన జీవీజీకేఆర్‌ఓ అనాథ శరణాలయం అభివృద్ధికి శాఖాపరంగా కృషి చేస్తామని జిల్లా దేవదాయ శాఖ అధికారి కె.వీరాంజినేయులు అన్నారు. మండలంలోని పిల్లుట్ల గ్రామంలో ఈఓ జి.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జీవీజీకే అనాథ శరణాలయం దాతలు గుర్రం వీరారెడ్డి, గోపాలకృష్ణారెడ్డి 102వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో దాతల చిత్రపటాలతో గ్రామోత్సవం నిర్వహించారు. దాతల సమాధుల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరాంజినేయులు మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన పిల్లుట్లలో వందేళ్ల క్రితం తమకున్న యావదాస్థిని, సుమారు 600 ఎకరాల భూమిని విద్యాభివృద్ధికి దానం చేసి, ట్రస్టు ద్వారా పాఠశాలను, వసతిగృహాన్ని ఏర్పాటు చేసిన గుర్రం వీరారెడ్డి, గోపాల కృష్ణారెడ్డిల దానగుణం ఎన్నడూ మరువలేనిదని అన్నారు. ఇక్కడ విద్యనభ్యసించిన ఎందరో నేడు ఉన్నత స్థితిలో ఉన్నారని గుర్తు చేసారు. శాఖాపరంగా శరణాలయం, పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు. దేవదాయ శాఖ ఈఓలు సుబ్బారెడ్డి, నెమిలిరెడ్డి, రామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచ్ శివపార్వతీ సాంబశివరావు, ఎంపీటీసీ అంజమ్మ వీరాస్వామి, మాజీ ఎంపీటీసీ రాజు, విద్యాకమిటీ చైర్మన్ హనుమంతరావు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా దేవదాయ శాఖ అధికారి వీరాంజినేయులు
Comments
Please login to add a commentAdd a comment